ఔను! ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో కందుకూరు నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? భౌతిక కారణం.. అంటే కళ్లముందు మాత్రం.. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారు.. కాబట్టి వేల సంఖ్యలో సభకు జనాలు వచ్చారు.. సో.. తొక్కిసలాట జరిగింది.. అందుకే చనిపోయారు!
కానీ, తెరదీసి చూస్తే.. ప్రభుత్వ యంత్రాంగం ఎంత విఫలమైందో.. పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరించిందో కళ్లకు కడుతోంది. ఎందుకంటే.. చంద్రబాబు సభలు ఇప్పుడు కొత్తకాదు. ఇటీవల విజయనగరంలోని విజయనగరం, బొబ్బిలిలోనూ.. ఆయన సభలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు, అభిమానులు పోటెత్తారనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు నెల్లూరు పర్యటనకు వస్తున్న విషయం గత వారం రోజుల నుంచి ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలో పోలీసులు.. కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ.. విజయనగరంలో నిర్వహించిన సభను ఉదాహరణగా తీసుకుని.. ఇక్కడ చర్యలు తీసుకుని ఉన్నా.. ప్రజలను అదిలించి ఉన్నా.. ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని.. టీడీపీ నేతలకు సూచించి ఉన్నా.. ఈ పెను విషాదం జరిగి ఉండేది కాదు. కానీ, ప్రభుత్వ పెద్దలు చెప్పారనో.. లేక.. మరో కారణమో.. తెలియదు కానీ.. పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులుకానీ.. చాలా నింపాదిగా వ్యవహరించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
అప్పట్లోనూ తోపులాట చోటు చేసుకుంది. ఇక, ఇప్పుడు ఏకంగా 8 మంది ప్రాణాలు డ్రైనేజీలో కలిసిపోయాయి. దీనికి కారణం.. పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందు చూపు లోపించడమేనని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్ష నాయకుడికి ఇటీవల కాలంలో ప్రజాదరణ పెరిగిన నేపథ్యంలో వారు ఒకింత బాధ్యతగా వ్యవహరించి ఉంటే.. ఈ విషాద ఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు.