చంద్ర‌బాబు స‌భ‌లో అప‌శ్రుతి.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

Chandrababu
Chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నెల్లూరులో ప‌ర్య‌టిస్తున్నారు. తొలి రోజు బుధ‌వారం ఆయ‌న‌ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌భ ప్రారంభించే స‌మ‌యానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాలు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏడుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డి మృతి చెందారు. మ‌రో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న‌ సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబును చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్య‌క‌ర్త‌లు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొంద‌రిని బ‌య‌ట‌కు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.