రాబోయే ఎన్నికలు ఎన్నికలు కావు. ముఖ్యంగా TDPకి ఈ ఎన్నికలు చావోరేవో తేల్చేసే ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ యువ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పాదయాత్రపైన ఆ పార్టీ ఆశలన్నీ పెట్టుకుని ఉంది. ఈ పాదయాత్ర ఆషామాషీలాంటిది కాదు. టీడీపీ భవిష్యత్తును తేల్చేసేదిగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా నారా లోకేష్ సత్తాకు అగ్నిపరీక్ష లాంటిది ఈ పాదయాత్రని భావిస్తున్నారు.
400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రను చేపట్టునున్నారు. ఈ యాత్రకు యువ గళం అని పేరు కూడా పెట్టారు. దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడానికి ప్రచార వ్యవహారాలన్నీ వ్యూహాత్మకంగా టీడీపీ, LOkesh బృందం చేపడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగాన పాదయాత్రల సంస్కృతికి బీజం వేసిన వారు మాజీ సీఎం వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి. అప్పట్లో ఆయన చేసిన పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టి ఆయన్ను అధికారపీఠంపై కూర్చొనేలా చేశారు. ఆయన తరువాత చంద్రబాబు నాయుడు కూడా పెద్దఎత్తున పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు. తదుపరి YS Jagan కూడా ఏపీలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసి తన సత్తా చాటారు. ఆయన పాదయాత్రలకు జనం పోటెత్తారు. అదే స్థాయిలో ఆయనకు ఎన్నికల్లో ప్రజలు అద్వితీయమైన విజయాన్ని కూడా చేకూర్చిపెట్టారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవితవ్యానికి అగ్నిపరీక్షలా మారింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారపీఠం చేజిక్కించుకుంటే నారా లోకేష్ సీఎం అవుతారు. ఒక వేళ ఫలితాలు తారుమారైతే ఆయన రాజకీయ భవితవ్యమే అగమ్యగోచరంగా మారే సూచనలే ఎక్కువున్నాయి. మరోవైపు పార్టీకి పూర్వపు జవసత్వాలు తీసుకు వచ్చి పార్టీని అధికారపథంవైపు నడిపించడానికి పాదయాత్ర చేపట్టాలని చినబాబు నిర్ణయించుకున్నారు.
అయితే ఈ పాదయాత్ర టీడీపీ శ్రేణులు అనుకున్నంత సులభం కాదు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని చేపట్టాల్సి ఉంది. నారా లోకేష్ ఈ పాదయాత్రను ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లగలుగుతాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఆయన చేసే ప్రసంగాలపైనే విమర్శకులు దృష్టి సారిస్తారు. ఏ మాత్రం నోరు జారినా ఇక లోకేష్‌పైన అటు బహిరంగంగానూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శల జడి కురిపించడానికి వైరి పక్షాలు సిద్ధంగా ఉంటాయి.
పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజలతో నారా లోకేష్ ఎలా మమేకమవుతారనేది ఆసక్తికరంగా మారింద. జగన్ తన పాదయాత్రలో ఎక్కడా ఆర్బాటాలకు తావులేకుండా సామాన్య జనంలో తాను ఒకడిగా, ప్రజల కుటుంబంలో తానూ ఒక కుటుంబ సభ్యుడు అనే భావనవచ్చేంత సాధారణంగా వారితో కలిసిపోయి తిరిగారు. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు నారా లోకేష్ ఆ విధంగా ప్రజలను ఆకట్టుకోగలడా అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది.
400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర నారా లోకేష్ వేసే ప్రతి అడుగు ఆయనకు అగ్నిపరీక్షలాంటిదే, ప్రతి అడుగు చప్పుడూ ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించే హెచ్చరిక చప్పుడు లాంటిదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి నారా లోకేష్ ఈ అగ్నిపరీక్షను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.