బాబాయ్‌కి అబ్బాయ్ ఝ‌ల‌క్‌.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఔట్‌!!

ఏపీలో రాజ‌కీయాలే కాదు.. నామినేటెడ్ ప‌దువుల్లోనూ సీఎం Jagan త‌న‌దైన మార్కు వేసుకుంటున్నారు. తాజాగా త‌న సొంత బాబాయి(విజ‌య‌మ్మ చెల్లెలు భ‌ర్త‌) వైవీ సుబ్బారెడ్డికి సీఎం జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న వైవీని ఆ పోస్టు నుంచి త‌ప్పించేయాల‌ని భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో టీటీడీకి త్వ‌ర‌లోనే కొత్త బోర్డుఏర్పాటు కానుంద‌ని అంటున్నారు.

ప్రస్తుత TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని జోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ బాధ్యతలు మొత్తం జగన్ ఆయనకే అప్పగించడంతో అటు టీటీడీ చైర్మన్, ఇటు పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడం ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నేది వాస్త‌వం. అలాగ‌ని శ్రీవారి సేవ‌ల‌ను వ‌దులుకోలేరు. కానీ, ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ క‌ట్టుత‌ప్పేసింది.

ఈ క్ర‌మంలో టీటీడీ బోర్డు ప‌ద‌వి నుంచి బాబాయిని త‌ప్పించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు ఒక వాదన వినిపిస్తోంది. అయితే.. టీటీడీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని వైవీనే స్వయంగా సీఎంకు చెప్పినట్లు ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని వైవీ స్పష్టం చేశారని, ఇందుకు జగన్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.

తిరుమలలో జనవరి 2 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు పూర్తయ్యాక వైవీని ప‌క్క‌న పెట్టేస్తార‌ని అంటున్నారు. వాస్త‌వానికి వైవీ.. ఏరికోరి మ‌రీ టీటీడీ బోర్డు ప‌ద‌విని తెచ్చుకున్నారు. కాబ‌ట్టి.. ఆయ‌నంతట ఆయ‌న ఈ ప‌ద‌విని వ‌దులుకుంటార‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ, టీటీడీపై ఇటీవ‌ల కాలంలో కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో వైవీపై జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు.

అయితే.. ఆయ‌న‌కు ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. అక్క‌డ‌ కూడా పార్టీ ప‌రిస్థితి కుదుట ప‌డ‌లేదు. మ‌రి ఏం చేస్తారు? టీటీడీ ప‌ద‌వి తొల‌గించినా.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాధాన్యం ద‌క్కుతుంద‌నే సంకేతాలు లేవు. మొత్తానికి బాబాయి విష‌యంపై జ‌గ‌న్ అస‌హ‌నంతో ఉన్నారా? లేక‌.. పార్టీకోసం.. ఇలా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.