వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి Perni Nani సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు వంగవీటి రంగా హత్యపైనా.. ఆయన వర్ధంతి కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్రంలో తీవ్ర స్తాయిలో రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అదే కాపులను ఉద్దేశించి పేర్ని నాని సంచలన కామెంట్లుచేశారు. ఏపీకి కాపు నేత సీఎం అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తి వస్తే.. ఏపీకి కాపు నేత సీఎం కావొచ్చన్నారు.
రాష్ట్రంలో కాపులకు వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాపుల తరఫున మాట్లాడుతున్న కొందరు టీడీపీ నాయకులు గతంలో ముద్రగడను కొట్టించినప్పుడు.. ఇంట్లో బంధించినప్పుడు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయితే.. మంచిదే. రాష్ట్రానికి కాపుల్లో సమర్ధుడు ఉన్నాడని అనుకుంటే.. ప్రజలే పట్టం కడతారు. జగన్ ఆపితే ఆగిపోతారా? నేను ఆపితే ఆగిపోతారా? ఎవరు ఏం చేస్తున్నారో.. ఎవరు ఎన్నికల సమయంలో ఎన్ని నాటకాలు ఆడుతున్నారో.. అందరికీ తెలిసిందే అని పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
జోగయ్య హెచ్చరికలపై..
కాపు నాయకుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దీక్షను స్వాగతిస్తున్నామని పేర్నినాని ప్రకటించారు. కాపులకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వ ఉత్తర్వును డిసెంబరు నెలాఖరులోగా ఇవ్వకుంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హరిరామ జోగయ్య హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ కు రాసిన లేఖ కూడా రాశారు. కాపులపై సీఎంకు ఏమాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు.
గత ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి జగన్ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని తెలిపారు. మూడేళ్లలో జగన్ కాపులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అయితే.. ఎవరు ఎవరికి అన్యాయం చేశారో.. గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారని.. ఈ విషయం జోగయ్యకు తెలియదా? అని పేర్ని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates