అవును.. ఇప్పుడు కాపుల ఓట్లు ఏపీలో కీలకంగా మారనున్నాయి. ఒక్క కాపులనే కాదు.. ఈ సామాజికవర్గంలో కీలకమైనటు వంటి అనేక ఉప కులాల ఓట్లు కూడా పార్టీలకు ప్రధానం కానున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తమవైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ జనాభాలో 25 శాతం వరకు కాపులు, వారి ఉప కులాల ఓట్లు ఉన్నాయి. ఇప్పటకీ వారికి రాజ్యాధికారం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తాము రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాలని వారు ప్రయత్నాలు ప్రారంభించారు.
అందుకే కాపులు అందరిని ఏకతాటిమీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే..ఇక్కడ YCP అన్నింటికీ మించిన మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎంత విడదీయాలని అనుకున్నా.. రంగాకు-కాపులకు.. మధ్య అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ బంధాన్ని తెంచేయాలనేది అధికార పార్టీ నేతల వ్యూహంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
గత రెండు రోజులుగా గుడివాడ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. కాపులు ఇప్పుడు జనసేనకు అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. Janasena రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. కాపుల ఓట్లు ఆటోమేటిక్‌గా.. టీడీపీవైపు మళ్లే అవకాశం ఉంది. దీనిని అరికడితే తప్ప.. వైసీపీ కీలక ఓట్లు చీలకుండా ఉంటాయి.
ఈ నేపథ్యంలో రంగా విషయాన్నిపెద్దది చేయడం.. తద్వారా.. టీడీపీని బూచిగా చూపించడం.. ఆ వెంటనే TDPతో పొత్తుకు రెడీ అవుతున్న జనసేన వైపు కాపులను మళ్లకుండా చూడాలనేది వైసీపీ అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.