రేవంత్, సంజయ్, కాసాని డిస్కషన్.. కేసీఆర్‌లో టెన్షన్

KCR నేల విడిచి సాములు చేయడం ఏమో కానీ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పక్షాలన్నీ కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అధ్యక్షులు ముగ్గురూ మాట్లాడుకోవడం చూసిన బీఆర్ఎస్ శ్రేణులు బెంగ పెట్టుకుంటున్నాయి. అంతా కలిసి తమ పార్టీని ఓడగొట్టడం ఖాయమని, కేసీఆర్ దొర రెస్ట్ తీసుకోక తప్పేలా లేదని భయపడుతున్నాయి. తాజాగా తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందులో ఈ రాజకీయ భేటీలన్నీ కనిపించాయి. అప్పటికప్పుడు కలుసుకోవడాలు… క్యాజువల్‌గా ముచ్చట్లు పెట్టుకోవడాలే అయినా బండి సంజయ్, రేవంత్, కాసానిల కలయికలో మాత్రం ఒక పాజిటివ్ పొలిటికల్ గెశ్చర్ కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

సీఎం కేసీఆర్ రాజ్ భవన్‌కు రాలేదు. ఆయన పార్టీకి చెందిన కొందరు మంత్రులు, సీఎస్ మాత్రం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న Revanth Reddy అక్కడ కేసీఆర్ కేబినెట్లోని మంత్రులను పలకరించారు. ఆ తరువాత అసలు ముచ్చట మొదలైంది. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చాలా సేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు ప్రధాన ప్రతిపక్షాల అధ్యక్షులు ఇంత హాయిగా మాట్లాడుకోవడంతో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే చర్చ తెలంగాణలో మొదలైంది. ఇది చాలాదన్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈ ఇద్దరినీ కలిశారు. మొత్తానికి ముగ్గురు నేతలూ చాలాసేపు అక్కడ మాట్లాడుకోవడం ఇప్పుడు డిస్కషన్లకు తెరతీసింది.

రేవంత్ రెడ్డి, Bandi Sanjay ఇద్దరూ సీఎం కేసీఆర్‌తో నిత్యం తలపడుతున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంతో బద్ధ విరోధులుగా మెలగుతూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ ఇంకా స్పీడు పెంచనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలోని ఖమ్మంలో సభ పెట్టడం, ఆ సభ మంచి సక్సెస్ కావడంతో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను TDP కూడా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకోవడమనేది బీఆర్ఎస్ శిబిరంలో బెంగ పుట్టిస్తోందట.