‘అధినేతల‌ పోరు’ : హైజాక్ చేస్తున్న నేత‌లు!

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటు.. టీడీపీ అటు వైసీపీ నేత‌లు రెండు ప‌క్షాల్లోనూ.. హైజాక్ రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. అధినేత‌లు ఇద్ద‌రూ.. కూడా వారి మానాన వారు త‌న్నుకుంటున్నారు. మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అధికారం నీదా.. నాదా.. అని వాదించుకుంటున్నారు. దీంతో ఫోక‌స్ అంతా కూడా.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చుట్టూ తిరుగుతోంది.

దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు త‌మ ప‌నుల్లో బిజీ అయిపోయారు. రెండు పార్టీల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధినేత‌లు అడిగిన‌ప్పుడు చూద్దాం లే! అనుకుని నాయ‌కులు ఎవ‌రి ప‌నుల్లో వారు ఉన్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు ఒక‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి 6 మాసాలు అయిపోయింది. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఆయ‌న అందుబాటులో లేరు.

ఇక‌, వైసీపీలోనూ.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒక‌రు నిత్యం మీడియాలో ఉండేవారు. కానీ, ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంతో ఇంతో వెనుకేసుకునేందుకు వ్యాపారాల్లో మునిగిపోయార‌ని.. పార్టీలోనే చ‌ర్చ‌సాగుతోంది. అదేవిధంగా సీమ‌లో కొంద‌రు ఫైర్ బ్రాండ్లు.. కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏం చెప్పినా.. స‌రే స‌ర్‌! అంటూ.. వెన‌క్కి తిర‌గ్గానే వ్య‌వ‌హారాలు మార్చేస్తున్నారు.

ఇలా.. ఒక్క టీడీపీ అనికానీ, వైసీపీ అనికానీ కాదు.. రెండు పార్టీల్లోనూ అధినేతలు వారి ప‌నుల్లో వారు ఉన్నార‌నే సాకుతో.. ఇటు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎవ‌రి ప‌నుల్లో వారు ఉన్నారు. దీంతో అధినేత‌లు వ‌స్తేనే.. సంద‌డి.. లేక‌పోతే.. ఏమీ లేదు.. అన్న‌ట్టుగానే ఉంది ప‌రిస్థితి. మ‌రి ఇలా అయితే.. ఎలా? అనేది ప్ర‌శ్న‌. ముఖ్యంగా టీడీపీ పుంజుకునే ద‌శ‌లో ఉన్న‌ప్పుడు.. ఇలా చేయొచ్చా? అనేది ఆలోచించాలి.