మెగా ఫ్యాన్స్ సంద‌డేది.. కీల‌క స‌మ‌యంలో కనిపించ‌రేం..!

మెగా ఫ్యాన్స్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించేందుకు రెడీ అయిన‌ట్టుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. విజ‌య‌వాడ‌లోనూ వారు భేటీ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన పార్టీని ఓన్ చేసుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌నిచేయాల‌ని అనుకున్నారు. ఈ ప‌రిణామం.. రాష్ట్రంలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం రేపింది. మ‌రోవైపు.. మెగాస్టార్ కుమారుడు రామ్‌ చ‌ర‌ణ్ కూడా బాబాయి పిలుపు ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తామ‌న్నారు.

ఈ రెండు ప‌రిణామాలు కూడా.. రాష్ట్రంలో జ‌న‌సేన దూకుడును పెంచుతాయ‌ని అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. అయితే.. ఇప్ప‌టికి ఈ స‌మావేశం జ‌రిగిన ఆరు మాసాలు అయిపోయింది. ఈ మ‌ధ్య‌లోనే ప‌వ‌న్ అనేక స‌భ‌ల్లో ప్ర‌సంగించారు. జూన్‌లో నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ స‌భ నుంచి ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం స‌భ వ‌ర‌కు అనేక చోట్ల ప్ర‌సంగించారు. అయితే.. ఈ క్ర‌మంలో ఎక్క‌డా మెగా ఫ్యాన్స్ సంద‌డి, సంబ‌రం క‌నిపించ‌లేదు.

అలాగ‌ని.. వీరు ప‌క్క‌కు త‌ప్పుకుంటార‌ని కూడా చెప్ప‌లేం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఉంటున్నారు.. అనేది ప్ర‌శ్న‌. సో.. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వెయిట్ చేస్తారా? అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోరా? అనేది కూడా సందేహ‌మే. రాష్ట్రంలో జోరు చూస్తే.. వైసీపీ, టీడీపీలు పుంజుకుంటున్నాయి. మ‌రోవైపు.. స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నాయి.

కానీ, మెగా ఫ్యాన్స్ సంద‌డి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం.. ఎప్పుడో ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చినా.. ప్ర‌యోజనం ఉంటుందా? అప్ప‌టికే ప్ర‌జ‌ల మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది క‌దా.. అప్పుడు వీళ్లు చెప్పిన‌ట్టు న‌డుస్తుందా? అనేది కూడా సందేహ‌మే. సో.. ఎలా చూసుకున్నా.. మెగా ఫ్యాన్స్ సంద‌డి అయినా.. ప‌వ‌న్ సంద‌డి అయినా.. ఇలా క‌నిపించి.. అలా మాయ‌మ‌వుతున్న‌ట్టుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.