ఏమైనా చెబితే.. అతికేట్టుగా ఉండాలి. కనీసం ప్రజలు నమ్మేట్టుగా అయినా ఉండాలి. కానీ, ఇవేవీ తనకు అవసరం లేదనుకున్నారో ఏమో.. ఏపీ కీలకనాయకుడు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికలకు ముందు.. మద్య నిషేధం జరిగితీరుతుందని నొక్కి వక్కాణించారు. అయితే.. దీనిపై నెటిజన్లు మాత్రం ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఇదేదో 2022 ఇయర్ జోక్‌గా ఉందే! అని అంటున్నారు.
ఎందుకంటే.. వచ్చే 25 సంవత్సరాలకు మద్యంపై వచ్చే రాబడిని హామీగా పెట్టుకుని ఏపీ ప్రభుత్వం అప్పులు చేసింది. అదేసమ యంలో బార్లు పెంచేసింది. ప్రభుత్వమే నేరుగా.. మద్యం వైన్ దుకాణాలుమెయిన్ టెయిన్ చేస్తోంది. ఇవి చాలవన్నట్టుగా.. వైన్ మాల్స్(అంటే.. నేరుగా మనం షాపులోకి వెళ్లి నచ్చిన బాటిల్ చేతబుచ్చుకుని బిల్లు చెల్లించే విధానం) తీసుకువచ్చింది. ఇవి విజయవాడ, విశాఖ, తిరుపతిలో ఉన్నాయి. వీటిని కూడాపెంచుతున్నారు.
మరి ఇంతగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్న సర్కారు.. 2024 ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేయాలని చూస్తోందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చెప్పడం నిజంగానే జోక్‌కాక మరేమిటని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వం త్వరలో మద్యపాన నిషేదంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని ఎన్నికలలోపు మద్యం నిషేధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
మద్యపాన నిషేధ ఆలోచన ప్రభుత్వ చర్చల దశలో ఉందని, ఆ నిర్ణయం తీసుకుంటే వంద షాపులు ఉన్నా, పది షాపులు ఉన్నా.. మూతపడక తప్పదని స్వామి అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధంపై నిర్ణయం ఉండే అవకాశం ఉందని విశాఖలో ఆయన తెలిపారు.
‘సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా దృష్టిలో ఉంది. అయితే రాష్ట్ర అర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా ఇంకా మద్యం షాపులు నడుస్తున్నాయి. దీనిపై ఎన్నికలలోపు నిర్ణయం తీసుకుంటారు. విజయనగరంలో నిన్న రాత్రి అశోక్ గజపతి బంగ్లాలో బస చేసిన చంద్రబాబు రాష్ట్రంలో మళ్లీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. 1995 అశోక్ గజపతి బంగ్లాలో ఎలాగైతే కుట్రలకు తెరతీశారో మళ్లీ అదే బంగ్లాలో బస చేశారు కనుక.. మళ్లీ ఎలాంటి కుట్రలకు తెరలేపుతారోననే అనుమానం కలుగుతోంది.“ అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates