సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తరచుగా వార్తల్లోకి వస్తుంటారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. అంటూ.. ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. తెలుగువారైన ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ప్రస్తుత సీఎం జగన్ కేసులను విచారించి.. పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ అరెస్టుతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
ఈ క్రమంలో విశాఖ ఎంపీగా వివీ పోటీ చేయడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ యన గెలుపు ఖాయమనే చర్చకూడా జరిగింది. పార్టీ తరఫున కాకుండా.. ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం.. తర్వాత కాలంలో పవన్ మాట తప్పారంటూ..(అంటే.. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సినిమాల్లోకి వెళ్లడంతో) ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఇక, అప్పటి నుంచి వైసీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఏం జరిగిందో ఏమో.. ఆయన మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు తాను స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే.. దీనిపై విశాఖ రాజకీయ వర్గాలు ఆసక్తికర చర్చతెరమీదకి తెస్తున్నాయి. వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఆయనను వైసీపీ తెరచాటు నుంచి నడిపిస్తోందని అంటున్నారు.
ఓట్లు చీల్చడం ద్వారా వైసీపీకి మేలు జరిగేలా ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపాలనేది వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా చేస్తున్న చర్చలేనని చాలా మంది చెబుతున్నారు. లేకపోతే.. ఆయన తిరిగి జనసేనలోక వచ్చినా.. టీడీపీలోకి వచ్చినా.. అదే సీటును కేటాయించేందుకు రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. వీరిని కాదని.. స్వతంత్రంగా పోటీ చేయడం వెనుక వైసీపీ ఉందని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.