పెళ్లి అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం. వారి వ్యక్తిగత జీవితంలో తమకున్న పరిస్థితులకు తగ్గట్లుగా కలిసి ఉండటం. లేదంటే విడిపోవటం అన్నది వారి ఇష్టం. దాన్ని భూతంలా చూపించటంలో అర్థమేంటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి అదే పనిగా వ్యాఖ్యానించటం ద్వారా తాను భారీ మైలేజీ పొందటంతోపాటు.. పవన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నారన్న భావనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
కానీ.. అదే పనిగా ఇలాంటి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించటం ద్వారా పవన్ మీద సానుభూతిని పెంచేందుకు తాను దోహపడుతున్నానన్న విషయాన్ని ఆయన గుర్తించటం లేదన్న మాట వినిపిస్తోంది.
తనకు సంబంధించిన ఏ విషయాల్ని పవన్ కల్యాణ్ ఏ రోజు దాచుకున్నది లేదు. అదే సమయంలో.. తమను దారుణంగా మోసం చేశాడని విడిపోయిన భార్యల్లో ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చింది లేదు. వేదన చెందింది లేదు. అలాంటప్పుడు కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? విడిపోయిన భార్యలకు లేని ఇబ్బందంతా జగన్ కు ఎందుకన్నది ప్రశ్న. పవన్ ను అదే పనిగా టార్గెట్ చేయటానికి పెళ్లి.. పెళ్లాలు తప్పించి మరింకేమీ లేదా? అన్నది ప్రశ్న.
పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ అదే పనిగా మాట్లాడటం చూస్తే.. పవన్ కల్యాణ్ ను విమర్శించటానికి.. ఆయన చేస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టానికి మరేమీ లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కంటెంట్ లేనప్పుడు ఏదో ఒక పని చేసి..కంటెంట్ జనరేట్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో.. పవన్ విషయంలో జగన్ తీరు కూడా అలానే ఉందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. పవన్ వ్యక్తిగత జీవితాన్ని అదే పనిగా విమర్శించటం ద్వారా జగన్ చేయకూడని తప్పులు చేస్తున్నారంటున్నారు.
గతంలో వైఎస్ కుటుంబానికి చెందిన వారి వ్యక్తిగత విషయాల్ని కనీసం ప్రస్తావనకు తీసుకురాని వారు..ఈ రోజున జగన్ ఘనకార్యాల పుణ్యమా అని అందరి నోట్లో నానే పరిస్థితి. ఇదంతా చూస్తే.. పవన్ ను కెలకటం ద్వారా జగన్ సాధిస్తున్నది శూన్యమే కానీ.. అనవసరంగా తమ ఇంటి వారి ఇమేజ్ ను దెబ్బ తీసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు? అన్నది ప్రశ్నగా వినిపిస్తోంది.