సీనియ‌ర్ త‌మ్ముడి అస‌హ‌నం.. బాబుకు ఇబ్బందే బ్రో!!

ఆయ‌న సీనియ‌ర్‌నాయ‌కుడు, మాజీ మంత్రి. పైగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. కీల‌క‌మైన నాయ‌కుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయ‌న తీవ్ర అస‌హ‌నంలోకూరుకుపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు వ‌స్తుందో రాదో అనే బెంగ ఆయ‌న‌ను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు య‌క్టివ్‌గా ఉన్న స‌ద‌రు సోద‌రుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఆయ‌నే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన మధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆల‌పాటి రాజా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్నారు. అయితే.. జ‌న‌సేనతోపొత్తు పెట్టుకుంటే.. ఈసీటును ఖ‌చ్చితంగా టీడీపీ వ‌దులుకోవాలి.

ఎందుకంటే.. జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. తెనాలి నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ విష‌యంపై ఆల‌పాటి మ‌న‌స్తాపంతో ఉన్నారు. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశా. ఒక సీటు అని రాసి పెట్టలేదు. నేను మానసికంగా సిద్ధ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అధికారం నాకు కొత్త కాదు అని వ్యాఖ్యానించారు.

తొలుత ఈ ఏడాదిలో గ‌త రెండు మాసాల వ‌ర‌కు కూడా ఆయ‌న పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ, గ‌త నెల నుంచి మాత్రం ఆయ‌న సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణాలు తెలియ‌క‌పోయినా.. తాజాగా మాత్రం ఆయ‌న స్పందించి..తానేమీ..ప‌ర్మినెంట్ కాద‌ని.. టీడీపీలో అనేక మంది నాయ‌కులు ఉన్నార‌ని.. అధినేత ఇష్టం అంటూ.. ముక్త‌స‌రి వ్యాఖ్య‌ల‌తో పార్టీలోకాక పుట్టించారు. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం నేత‌గా గుర్తింపు ఉన్న ఆల‌పాటి రియాక్ష‌న్ పార్టీపై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.