వైసీపీ నేతకు టీడీపీలో ఎంపీ టికెట్

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేరు తెలియని వారుండరు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన తర్వాత బాగా వెనుకబడిపోయారు. కడప జిల్లాకు చెందిన ఆయన ఇప్పుడు మాత్రం అమావాస్యకు, పౌర్ణానికి మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. ఆయన మాటల్లో రాజకీయాల కంటే రాజకీయ విశ్లేషణలే ఎక్కువగా ఉంటుంటాయి.
రవీంద్రా రెడ్డి కూడా ఎంపీ రఘురామ కృష్ణంరాజులాగే తయారయ్యారు. వైసీపీలో ఉంటూ జగన్ ను విమర్శించడం అలవాటుగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుందని తాజాగా ప్రకటనలిస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని రవీంద్రా రెడ్డి జోస్యం చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రవీంద్ర రెడ్డి అంటున్నారు

ఇటీవలి కాలంలో రవీంద్రారెడ్డి టీడీపీని కూడా ఒకటి రెండు సార్లు విమర్శించినా… చివరకు హార్డ్ కోర్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారు. అందుకు కారణాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటుంటే.. వైసీపీ మాటల్లో నిజం ఉందని టీడీపీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు రవీంద్ర రెడ్డి సిద్ధమయ్యారట. పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా మాట్లాకున్నారట.

మైదుకూరు నుంచి 1978 – 2009 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర రెడ్డి మళ్లీ అక్కడే టికెట్ కావాలని చంద్రబాబును అడిగినట్లు చెబుతున్నారు. అయితే చంద్రబాబు కూడా ఆయనకో ట్విస్ట్ ఇచ్చారు. రాయలసీమ జిల్లాల్లో ఏదోక చోటి నుంచి ఎంపీగా పోటీ చేయాలని రవీంద్రా రెడ్డికి సూచించారు. ఇష్టమైతే ఉమ్మడి కడప జిల్లాల పరిధిలోకి వచ్చే లోక్ సభా నియోజకవర్గాన్ని కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దానితో రవీంద్రారెడ్డి అయిష్టంగానే అందుకు అంగీకరించారని చెబుతున్నారు. అయితే రవీంద్రారెడ్డి అధికారింగా వైసీపీకీ దూరం కాలేదు. టీడీపీలో చేరలేదు. అయినా టీడీపీ అధికార ప్రతినిధి కంటే ఎక్కువ పవర్ ఫుల్ గా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటో ఇప్పటికే జనానికి అర్థమై ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి….