తారీకులు.. దస్తావేజులు.. నాకు గుర్తులేవని.. మహాకవి శ్రీశ్రీ అంతటి వారుచెప్పినా.. నాయకులు సైతం మరిచిపోయినా.. అదేంటో కానీ.. ప్రజలు మాత్రం “మాకు తారీకులూ గుర్తున్నాయి. దస్తావేజులూ గుర్తున్నాయి” అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ జాబులకు క్యాలెండర్ ఇచ్చి.. మరిచిపోకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ, మరిచిపోయారు.
సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇచ్చారు. అమలు చేస్తున్నారు. వీటికి గాను అప్పులు కూడా చేస్తు్న్నారు. అయితే.. ఆయన మరిచిపోయింది.. ఆయన సొంత జిల్లా కడప ప్రజలు గుర్తు పెట్టుకున్నది ఒకటి ఉంది. అదే ‘డిసెంబరు 23’ ఇది ఏ మహానాయకుడి పుట్టినరోజో.. జయంతో.. వర్ధంతో కాదు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు అంతకన్నా కాదు. కానీ, కడప ప్రజలు మాత్రం మహా బాగా గుర్తు పెట్టుకున్నారు.
ఎందుకంటే.. ఇదే డిసెంబరు 23, 2019న ఇదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఏడాది కాలంలో దీనిని పూర్తి చేసి జిల్లాలోని 3000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కూడా ఆయన ఘంటా పథంగా చెప్పుకొచ్చారు. దీంతో డిసెంబరు 23 వచ్చిన ప్రతిసారీ.. ప్రజలు సీఎం జగన్ మాటలను.. ఈ డేటులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయింది. మరొక్క ఏడాది గడిస్తే.. ఎన్నికలు రానే వచ్చేస్తాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ ఏడాది డిసెంబరు 23న జగన్ యాదృచ్ఛికంగా.. అదే కడపలో పర్యటిస్తున్నారు. కడప దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొంటున్నారు. దీంతోఇక్కడి ప్రజలు. జగనన్నా గుర్తుందా? అంటూ.. వాట్సాప్‌లో గుర్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates