వీళ్లు వైసీపీలో ఉన్న‌ట్టా.. లేన‌ట్టా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు చెబుతున్నారు. వారు ఉన్న‌ట్టుగా ఆ పార్టీ ఎక్క‌డ ప్ర‌స్తావించ‌డం లేదు. మ‌రి ఈ నేతలు వైసీపీలో ఉన్నారా? ఉండి ఏం చేస్తున్నారు? పార్టీ కోసం ప‌నిచేస్తున్నారా? అంటే..చెప్ప‌డం క‌ష్ట‌మే. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుతం తాజాగా సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌.. మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నాన‌ని చెబుతున్నారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ అయితే.. ఆయ‌న‌మా నాయ‌కుడే అని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, డీఎల్ మాత్రం తాను వైసీపీ నేత‌న‌నే అంటున్నారు. ఇక‌, గాదె వెంక‌ట‌రెడ్డి. మాజీ మంత్రి. ఈయ‌న కూడా వైసీపీ నాయ‌కుడిన‌నే చెబుతున్నారు. కానీ ఆయ‌న కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి టికెట్ కోసం.. వైసీపీలో చేరారు. కానీ, ద‌క్క‌లేదు. ఇప్పుడు ఇన్నాళ్లుగా వారు కూడా సైలెంట్ అయిపోయారు.

దాడి వీర‌భ‌ద్ర‌రావు. ఈయ‌న ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నాయ‌కుడు. ఈయ‌న కూడా వైసీపీలో నే ఉన్నాన‌ని.. తాను పార్టీలు మారేది లేద‌ని చెప్పారు. కానీ, పార్టీలో మాత్రం ఆయ‌న ఊరు… పేరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఆయ‌న కుమారుడికి మాత్రం.. స్థానిక ప‌ద‌వి ఒక‌టి ఇచ్చారు. అయితే.. వీరిద్ద‌రూ కూడా ఎప్పుడూ వైసీపీ మాట మాట్లాడ‌లేదు. ఇక‌, ఇదే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో నాయ‌కుడు కొణ‌తాల రామ‌కృష్ణ‌.

ఉత్త‌రాంధ్ర అభివృద్ధి రాజ‌కీయ పార్టీ అంటూ గ‌తంలో హ‌డావుడి చేశారు. అయితే.. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌కు చేరువ‌య్యారు. అంత‌కు ముందు దూర‌మ‌య్యారు. మొత్తానికి ఇప్పుడు ఆయ‌న ఏ పార్టీ ఉన్నారంటే.. వైసీపీ నాయ‌కులు మాపార్టీలోనే ఉన్నార‌ని చెబుతున్నారు. కానీ, ఆయ‌న మాత్రం ఇండిపెండెంట్‌గానే ఉన్నాన‌ని చెబుతున్నారు. ఇలా.. రాష్ట్రంలో చాలా మంది నాయ‌కులు వైసీపీలో ఉన్నామ‌ని చెబుతున్నారు కానీ, పార్టీ లెక్క‌ల్లో వారిపేర్లు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. క‌నిపించ‌డ‌మూ లేదని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.