ఇదేంది జ‌గ‌న‌న్నా.. 3 వేల‌మంది పోలీసుల‌తో భ‌ద్ర‌తా?

ఏ నాయ‌కుడికైనా.. సొంత జిల్లా.. సొంత ప్రాంతం అంటే.. సొంత ఇల్లు లెక్క‌. ఎలాంటి భ‌ద్ర‌తా అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ అక్క‌డ ప‌ర్య‌టించారు. అయితే.. ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త ను పక్క‌న పెట్టి.. ఇది సొంత రాష్ట్రం ఇక్క‌డ‌నాకు ఎలాంటి భ‌యం లేద‌న్నారు.

అంటే.. సొంత రాష్ట్రంపై ఆయ‌న‌కు అంత న‌మ్మ‌కం. కానీ,ఏపీలో సీఎం జ‌గ‌న్‌కు త‌న సొంత జిల్లాపైనే న‌మ్మ‌కం లేన‌ట్టు ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి మూడు రోజులు పాటు త‌న సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా ఆయ‌న త‌న పుట్టింటికి వ‌చ్చిన‌ట్టే క‌దా! పైగా.. గ‌త ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల‌ను కూడా సీఎం జ‌గ‌న్ గెలుచుకున్నారు. అంటే.. ప్ర‌త్య‌ర్థి అన్న మాటే లేదు. అయినా.. కూడా ఇక్క‌డ 3 వేల మందితో సీఎం జ‌గ‌న్ భ‌ద్ర‌త క‌ల్పించుకున్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

క‌డ‌ప‌ జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. సుమారు 3000 మంది పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులందరికీ ఎస్పీ అన్బురాజన్ విధులను కేటాయించారు.

అంతేకాదు.. బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టివ్ తదితర వాటితో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మ‌రి ఇదేం చోద్య‌మో.. అని నెటిజ‌న్లు బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.