నాయకుల్లేరు.. క్యాడర్ లేదు.. శంఖారావం సక్సెస్ ఎలా ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీనా? ఆ ప్రశ్నే ఒక పెద్ద జోక్. అలాంటి వేళలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోలేదన్న మాటనే నిజం చేసింది తాజాగా ఖమ్మంలో ముగిసిన శంఖారావం సభ. అలా అని.. ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి.. తెలుగుదేశం పార్టీ గురించి అతిగా ఊహించుకుంటే అంతకు మించిన పిచ్చితనం మరొకటి ఉండదు. తాజాగా వచ్చిన జనసందోహాన్ని చూసినప్పుడు.. తెలుగుదేశం పార్టీకి సరైన నేతలు.. క్యాడర్లు లేదన్నది నిజమే అయినా.. ఆ పార్టీకి నేటికి అభిమానులు ఉన్నారన్న విషయాన్ని తాజా సభ స్పష్టం చేసిందని చెప్పాలి.

నిజానికి సభ ఏర్పాటు చేసిన వేళ.. జనం వస్తారా? లేదా? అన్న దానిపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. అన్నింటికి మించి సభ కానీ పేలవంగా జరిగితే.. దాని ప్రభావం పార్టీ మీద కంటే కూడా చంద్రబాబు ఛరిష్మా మీద పడుతుందన్న ఆందోళన ఉంది. అయితే.. అనూహ్యంగా అంచనాలకు మించి జనం రావటం.. జోష్ కనిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో కాసానికి మార్కులు వేయాల్సింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చంద్రబాబు కోసం మధ్యాహ్నం నుంచే పలు గ్రామాల్లో ప్రజలు ఎదురుచూడటం. ఇదంతా చూసినప్పుడు చంద్రబాబుకు ఇప్పటికి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ తగ్గలేదన్న విషయం స్పష్టమవుతుంది. సభకు వచ్చే వారి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.. సభకు పెద్ద ఎత్తున యూత్ రావటం. ఇంతలా వస్తారన్న అంచనానే లేదు.

ప్రస్తుతం పార్టీలో పేరున్న నాయకులు లేరు. ద్వితీయశ్రేణి నేతలు లేరు. క్యాడర్ పోయి చాలాకాలమే అయ్యింది. అయినప్పటికీ ఇంత భారీగా సభకు హాజరు కావటం ఎలా? అదెలా సాధ్యమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయాన్ని తరచి చూస్తే అర్థమయ్యే విషయం ఏమంటే.. నాయకులు.. కార్యకర్తలు లేకున్నా.. తెలుగుదేశాన్ని అమితంగా ఆరాధించే అభిమానులే ఆ పార్టీ బలంగా మారిందని చెబుతున్నారు. ఇదే.. వారిని సభకు స్వచ్చందంగా వచ్చేలా చేసిందంటున్నారు. దీనికి తోడు.. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో.. టీడీపీ సత్తా చాటాలన్న కసి కూడా పెరిగిందని.. అదే టీడీపీ శంఖారావం సదస్సు సక్సెస్ కు మంత్రాగా మారిందన్న మాట వినిపిస్తోంది.