టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క సారి చేసే కామెంట్లు చాలా విస్మయం కలిగిస్తూ ఉంటాయి. చల్లకొచ్చి ముంత దాచేసే చందంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎందుకు? రాజకీయాల్లో ఉన్న నాయకులకు అధికారం, పదవులు చాలా ముఖ్యం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఈ రెండు అంశాల చుట్టూనే రాజకీయాలు తిరిగుతుంటాయి.అసలు అధికారం కోసం.. ఏపీలో రక్త సంబంధాలు కూడా తెంచేసుకుంటున్న నాయకులు కనిపిస్తున్నారు.
మరి అలాంటి పరిస్థితిలో తాజాగా 2018 తర్వాత తెలంగాణలోని ఖమ్మంలో పర్యటించిన(ఉండడం హైదరాబాదే అయినా) టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారం కోసం ఇక్కడకు రాలేదని.. ప్రజల అభిమానం కోసమే ఖమ్మం నగరానికి వచ్చానని చెప్పడం విస్మయం కలిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణకు తాను చేసిన సేవలను గుర్తుచేసిన చంద్రబాబు.. తెలుగువారికి ఆత్మబంధువుగా ఉండాలన్నదే తన చిరకాల కోరికని ప్రకటించారు.
లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఖమ్మం నగరంలో ఆయన ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. చాలా కాలం తర్వాత జిల్లాకు వచ్చిన తనకు ఇక్కడి ప్రజలు చూపుతున్న ఉత్సాహం ఆనందాన్ని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి ఉత్సాహాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా తన ఆత్మబంధువులన్న చంద్రబాబు… టీడీపీ రుణం తీర్చుకుంటామని భారీగా తరలివచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, ఇక్కడ చిత్రం ఏంటంటే.. తాను కోరుకునేది అధికారం కాదని ప్రజల అభిమానమని చంద్రబాబు వ్యాఖ్యానించడమే. ఎన్నికలు, ఓట్ల కోసం తానెప్పుడూ పని చేయలేదని అన్నారు. టీడీపీని ఎన్టీఆర్ అధికారం కోసం పెట్టలేదన్నారు. ఇది మరీ చిత్రంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చేందుకే ఎన్టీఆర్ ఊరూ వాడా చెట్టూ చేమా అంటూ.. తిరిగారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు మరి ఎందుకో.. అసలు విషయం మానేసి ఇలా కొసరు విషయాల చుట్టూ తిరిగారు.