‘జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను మా పై రుద్దకండి’

ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను త‌మ‌పై రుద్ద‌వ‌ద్దంటూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఘాటు రిప్ల‌య్ ఇచ్చింది. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే దుమ్ముదులిపేసింది. “ఏపీ సీఎం ఆలోచ‌న‌లు ఆయ‌న‌కు ఉంటాయి. అవి మేం పుణికి పుచ్చుకున్నామ‌ని ఎవ‌రు చెప్పారు? అలా అనుకుంటే..దేశంలో 30 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నా రు. వారు చేస్తున్న‌వ‌న్నీ కేంద్రం చేస్తుందా? మీ ఆలోచ‌న త‌ప్పు” అని కేంద్రం వైసీపీ ఎంపీల‌కు త‌గిన విధంగా స‌మాధానం చెప్పింది.

ఇంత‌కీ ఏం జ‌రిగింది?

ఏపీలో అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. పార్లమెంట్లో తాజాగా చర్చ జరిగింది.. దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఏమైనా ఉందానని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. దీంతో దిగ్గున త‌న సీటులోంచి లేచిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఫైర్ బ్రాండ్ నిరంజ‌న్ జ్యోతి ఘాటు స‌మాధ‌నం ఇచ్చారు. ఇది లిఖిత పూర్వ‌క‌మే అయినా.. చ‌దివి వినిపించారు.

“గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రతిపాదనేమీ మా వద్ద లేదు. ఇది ఏపీ సీఎంకు వ‌చ్చిన ఆలోచ‌న‌. దీనిని అక్క‌డే కొన‌సాగించుకోండి. మాపై రుద్దొద్దు” అని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో.. ప్రభుత్వ సేవలు అందించడానికి ప్రతి 2వేల మందికి ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. సీఆర్ఎం నివేదికలో పేర్కొన్న విష‌యం నిజ‌మేన‌ని ఆమె తెలిపారు.

అయితే.. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశం ఉందా అని… వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరిలు పార్లమెంటులో ప్ర‌శ్నించారు. దీంతో ఆమె ప్రస్తుతానికి ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనేదీ లేదని చెప్ప‌డంతో పాటు ఒకింత ఘాటుగా.. రిప్ల‌య్ ఇచ్చారు. దీంతో ఎంపీలు సైలెంట్ అయ్యారు. అయితే.. ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌నే విష‌యంపై మాత్రం ఆమె రియాక్ట్ కాలేదు.