రాజకీయంలో తెలంగానం.. వ్యాపారం ఆంధ్రోళ్లతోనా?

ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు ఉండటం ఇబ్బంది కలిగించేదే.

రాజకీయంగా ఇరుకున పడేయటం కోసం కవిత పేరును లాగారన్నదే పాయింట్ అయితే.. ఆ మాట నిజమే అనుకున్నా.. ఆమె వ్యాపారం చేసిన వారిలో అత్యధికులు ఆంధ్రా మూలాలు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఏమని చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈడీ ఛార్జిషీట్ లో కనిపించిన పేర్లలో..

  • మాగుంట శ్రీనివాసులు రెడ్డి
  • మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డి
  • అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి
  • బోయినపల్లి అభిషేక్
  • బుచ్చి బాబు
  • అరుణ్ పిళ్లై
  • సమీర్ మహేంద్రు
  • బినయ్ బాబు
  • విజయ్ నాయర్
  • విజయ్ నాయర్
  • కల్వకుంట్ల కవిత.
    ఈ మొత్తం పేర్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కంటే కూడా ఆంధ్రా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఉండటాన్ని రాజకీయ పక్షాలు ఆయుధంగా మలుచుకుంటాయని చెబుతున్నారు. తాజాగా కవిత పేరు ఎక్కువసార్లు వినపించటానికి.. కనిపించటానికి కారణం ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సమీర్ మహేంద్రు.. శరత్ చంద్రారెడ్డి.. బినయ్ బాబు.. విజయ్ నాయర్.. బోయినపల్లి అభిషేక్ ల నుంచి తీసుకున్న స్టేట్ మెంట్ల ద్వారానే ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు రచ్చ ఒక ఎత్తు అయితే.. అందులో ఉన్న పేర్ల కారణంగా ఇప్పుడు మొదలైన కొత్త చర్చ గులాబీ బాస్ కు ఇబ్బందులకు గురి చేసేలా ఉందంటున్నారు.

ఈడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనుకున్నా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కలిసి వ్యాపారం చేశారన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేం కదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ క్రియేట్ చేసి.. రాజకీయంగా లబ్థి పొందిన కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో అలాంటి అస్త్రాన్ని తీసేందుకు సాధ్యం కాదంటున్నారు.

ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే.. కవిత వ్యాపార భాగస్వాముల వ్యవహారాన్ని విపక్షాలు తెర మీదకు తేవటం ద్వారా ఇరుకున పడేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. ఏమైనా.. ఢిల్లీ మద్యం కేసు కల్వకుంట్ల కుటుంబానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.