కల్వకుంట్ల కవిత కష్టాలు – త్వరలోనే ఈడీ విచారణ

కవిత అరెస్టు ఖాయమా.. !
ఆమెను ఫిక్స్ చేసేందుకు కొత్త ఎఫ్ఆఐర్ వేస్తారా !
ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం కవిత చుట్టూ తిరిగిందా !
బీఆర్ఎస్ నేతలకు, ఢిల్లీ ఆప్ కు ఉన్న లింకులు బయటపడుతున్నాయా !

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఆమెను కేవలం సాక్షిగానే విచారించగా.. ఈడీ ఏకంగా ఛార్జ్ షీటులో ఆమె పేరు చేర్చింది. గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ప్రస్తావనకు రాగా.. ఇప్పుడు ప్రధాన నిందితుడు సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్‌ లో కవిత పేరు వచ్చింది. మొత్తం 28 సార్ల కవిత పేరును ప్రస్తావించారు.

గతంలో కవితపై వచ్చిన ఆరోపణలు నిజమని తాజా చార్జ్‌షీట్‌ లో నిర్ధారించేందుకు ఈడీ ప్రయత్నించింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ నేతలతో కవిత పలుమార్లు భేటీ అయ్యారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారులు లభించాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కవితతో పాటు మాగుంట రాఘవ్, శరత్ చంద్రారెడ్డిపై కూడా ఈడీ పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది.

సమీర్‌ మహేంద్రుకు ఇండో స్పిరిట్స్‌ పేరిట ఎల్‌1 హోల్‌సేల్‌ లైసెన్సు లభించిందని, సౌత్‌గ్రూపునకు మొత్తం 7 జోన్లలో రిటైల్‌ లైసెన్సు లభించిందని వెల్లడించింది. సౌత్‌గ్రూప్ ద్వారా విజయ్‌నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు అందాయని.. ఈ సిండికేట్‌ మొత్తం 32 రిటైల్‌ జోన్లలో తొమ్మిదింటిని దక్కించుకుందని స్పష్టం చేసింది.

ఈడీకి సమర్పించిన చార్జ్ షీటులో బ్యాంక్ లావాదేవీలు కూడా ఉండటంతో పక్క ఆధారాలు సేకరించారనే నిర్ధారణకు వచ్చారు. మాగుంట రాఘవ్ ఖాతాల నుంచి ఎవరెవరికి నగదు వెళ్లిందో కూడా తేల్చేశారు. దానితో ఇప్పుడు సౌత్ గ్రూప్ వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

కవితను త్వరలో సీబీఐ రెండో సారి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈ సారి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి రావాలని కోరవచ్చు. ఈడీ చార్జ్ షీటులో పేరు ఉన్నందున ఆ సంస్థ కూడా ప్రశ్నించాల్సిందే. ఆ పని హైదరాబాద్ లో జరుగుతుందా… లేక ఢిల్లీలో నిర్వహిస్తారో చూడాలి. పనిలో పనిగా ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగితే ముప్పేట దాడి ఖాయమని తేలిపోతుంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలను ఫిక్స్ చేయాలంటే కవితను ప్రశ్నించాల్సిందేనని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ తో పాటు ఆప్ కూడా టార్గెటేనని చాలా రోజుల క్రితమే తేలిపోయింది.