రాజకీయాల్లో కొన్ని విషయాలు దాచాలన్నా.. దాగవు. ఇది నిష్టుర సత్యం. నాయకుల మనసులో ఏముందో .. వారి చేతల్లోనో.. మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్లలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గాల మధ్య పోరు ఏ రేంజ్‌లో సాగిందో అందరికీ తెలిసిందే. కేవలం మాచర్ల నియోజక వర్గంలోనే కాదు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి కూడా టీడీపీని రాకుండా చేయడంలో వైసీపీ నాయకులు కృతకృత్యులయ్యారు.
అయితే.. ఎంత కార్యకర్తలను అనుకున్నా.. నాయకులను అనుకున్నా..వెనుక ఉన్న మూలవిరాట్లు చెప్పకుండా.. ఏమైనా జరుగుతుందా? శివుడి ఆజ్ఞలేకుండా.. అన్నట్టుగా మాచర్లలోనూ అదే జరిగిందని పిన్నెల్లి వర్గమే చెబుతోంది. తాజాగా జరిగిన పరిణామాలకు.. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలకు పెద్దగా తేడా ఏమీలేదు. నియోజకవర్గాన్ని మూడు దశాబ్దాలుగా ఏలుతున్న పిన్నెల్లి రామకృష్నారెడ్డి మాటే.. ఇక్కడ నెగ్గుతోంది.
ఇటీవల కాలంలో ఇది మరింతగా పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ, రాలేదు. ఈ క్రమంలోనే కొంత దుమారం రేపారు. అయితే.. సీఎం జగన్ దీనిని పట్టించుకోలేదు. ఇది పార్టీ అనుచరుల్లో అసంతృప్తిని పెంచేలా చేసింది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా టీడీపీ ఇక్కడ ఇదేం ఖర్మ చేపడితే.. అది కాస్తా.. విజయవంతం అయిందని మీడియాలో వస్తే.. తనకు ఇబ్బంది తప్పదని ఎమ్మెల్యే అంచనా వేశారు.
ఈ క్రమంలోనే చూసిరమ్మని.. తన వారిని పంపిస్తే.. వారు కాస్తా.. కాల్చుకొచ్చేశారని మాచర్ల పొలిటీసియన్ల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు ? అంటే.. పార్టీ అధిష్టానం తరఫున కీలక సలహాదారు ఒకరు.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే .. ఎమ్మెల్యే తప్పులేదు.. ఆయన చూసిరమ్మన్నారంటూ.. ఆయనతరఫున కీలక అనుచరులు.. చెప్పుకొస్తున్నారు. ఇదీ.. సంగతి!!