ఏపీలో మ‌హాకూట‌మి.. ఇదే ఫైన‌ల్‌!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులు.. పొర్లాట‌లు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జ‌నసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జ‌న‌సేన పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, టీడీపీ ప్ర‌స్తుతానికి ఒంట‌రిగా ఉంది. క‌మ్యూనిస్టులు కూడా ఎటూ దారి లేక‌.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం ద‌క్క‌కపోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక‌, మిగిలిన చిన్నా చిత‌కా పార్టీలు బీఎస్పీ, జైభీమ్ వంటివి య‌థాలాపంగా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏదో ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తాయి. ఇత‌మిత్థంగా చెప్పాలంటే.. ప్ర‌ధాన పోరు మాత్రం వైసీపీ-టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్యే ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తే.. ప‌వ‌న్ వ్య‌తిరేక ఓట్లు చీల‌నివ్వ‌బోమ‌ని చెబుతున్నారు. అలాగ‌ని బీజేపీని వ‌దుల‌కుని.. ఆయ‌న టీడీపీతో జ‌త‌క‌ట్ట‌డం కూడా లేదు.

అన్ని పార్టీల‌ను ఏకం చేస్తాన‌ని.. ఆ ప్ర‌య‌త్నంలోనే ఉన్నాన‌ని తాజాగా ప‌వ‌న్ చెప్పారు. అంటే.. దాదాపు ప‌వ‌న్ చెప్పిన సూత్రం ప్ర‌కారం.. ఏపీలో ఏ రెండు పార్టీలో పొత్తు పెట్టుకోవ‌న్న‌మాట‌! క‌ష్ట‌మో.. న‌ష్ట‌మో.. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన -బీఎస్పీ ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌న్నీ క‌లిసి.. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌డం ఖాయమని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2009లోనూ ఇలానే అప్ప‌టి వైఎస్‌పై మ‌హాకూట‌మి గా ఏర్ప‌డిన పార్టీలు పోటీకి దిగాయి.

ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అయితే, క‌మ్యూనిస్టులు మాత్రం బీజేపీతో అంట‌కాగ‌రు కాబ‌ట్టి.. ఆ కామ్రెడ్స్‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తంగా వైసీపీ ఒక‌వైపు, మ‌రోవైపు మ‌హాకూట‌మి రంగంలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ మ‌హాకూట‌మి ద్వారా రాష్ట్రంలో ఓటు బ్యాంకు చీల‌కుండా ఉంటుంద‌ని.. ఇదే వ్యూహంతో ప‌వ‌న్ కూడా ఉన్నార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలావుంటే, వైసీపీ కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌నే వారు కూడా ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.