ఆ రెడ్డి ఇబ్బంది అంతా ఇంతా కాదు..

వైసీపీలో కీల‌క మంత్రిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌రిస్థితి క‌క్క‌లేక‌.. మింగ‌లేక నానా తిప్పులు ప‌డుతున్న ట్టు క‌నిపిస్తోంది. పార్టీని గాడిలో పెట్ట‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం.. అనే బాధ్య‌త‌లు త‌ల‌కెత్తిన వారిలో పెద్దిరెడ్డి కూడా ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలే రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇత‌ర రెడ్డి నాయ‌కులు బాలినేని వంటివారుఉన్న‌ప్ప‌టికీ..వారిని జిల్లాల‌కే ప‌రిమితం చేశారు.

అయితే.. వైవీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మంత్రి పెద్దిరెడ్డి ప‌రిస్థితి మాత్రం దారుణంగా త‌యారైందనే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న ఏరికోరి టికెట్లు ఇప్పించుకున్న నాయ‌కుల‌కు ఇప్పుడు సెగ త‌గులుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం జిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డ క‌దిరి నుంచి సిద్దారెడ్డికి పెద్దిరెడ్డి చ‌ల‌వ‌తోనే టికెట్ ద‌క్కింది. అదేవిధంగా పెనుకొండ‌లో మాజీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ కూడా పేద్దిరెడ్డి వ‌ర్గంగా ఉన్నారు.

ఇక‌, శ్రీకాళ‌హ‌స్తి(తిరుప‌తి జిల్లా) ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి కూడా పెద్దిరెడ్డి శిష్యుడే, ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే వెంక‌ట గౌడ‌.. పెద్దిరెడ్డికి ద‌త్త‌పుత్రుడు లెక్క అంటారు. ఇలా సీమలో 7 నుంచి 10 మంది మంత్రి అనుచ‌రులుగా ఉన్నారు. వీరంతా కూడా పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తోనే గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు వీరి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే అస‌మ్మ‌తిసెగ జోరుగా త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం.

పైకి పెనుకొండ క‌నిపించినా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల్లో క‌దిరిని మించి ప‌ల‌మ‌నేరు ముందు స్థానంలో ఉంది. ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో కుంటుంబ తగాదాల‌తో ఎమ్మెల్యే రోడ్డున ప‌డ్డారు. ఇలా.. ఒక‌టి అని కాదు.. పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో ఎమ్మెల్యేలైన వారంతా చిక్కుల్లో ఉన్నారు. వారికి అస‌ల టికెట్లు ఇవ్వొద్దంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీరిని త‌ప్పించ‌లేక‌.. అధిష్టానం ద‌గ్గ‌ర వీరిని స‌మ‌ర్థించ‌లేక‌.. పెద్దిరెడ్డి ఇబ్బంది ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.