నందమూరి కుటుంబం నుంచి భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తారకరత్న. టాలీవుడ్ అనే కాక మరే ఫిలిం ఇండస్ట్రీలోనూ కనీ వినీ ఎరుగని విధంగా అరంగేట్రంలోనే అతడి సినిమాలు ఒకేసారి తొమ్మిది ప్రారంభోత్సవం జరుపుకోవడంతో తారకరత్న పేరు అప్పట్లో మార్మోగింది. కానీ ఈ తొమ్మిది చిత్రాల్లో సగం ముందుకే కదల్లేదు.
ఏళ్ల తరబడి హీరోగానే కాక విలన్, క్యారెక్టర్ రోల్స్‌లోనూ సినిమాలు చేసి చేసి అలసిపోయి ఇప్పుడు దాదాపుగా సినిమాలకు దూరం అయిపోయాడు ఈ నందమూరి హీరో. కొన్నేళ్లుగా అస్సలు వార్తల్లో లేని తారకరత్న.. ఉన్నట్లుండి రాజకీయ అరంగేట్రానికి సిద్ధం కావడం విశేషం.
వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు అతను ప్రకటించాడు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని.. టీడీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ రామన్న రాజ్యాన్ని తీసుకురావడం సాధ్యమని.. అందుకోసం తన అడుగు జనాల వైపు అని తన భవిష్యత్ కార్యాచరణను తారకరత్న ప్రకటించాడు. ఐతే తన వరకు తారకరత్న ఏం మాట్లాడినా ఓకే కానీ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఈ కార్యక్రమంలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేయడం చర్చనీయాంశం అయింది.
తన తమ్ముడు తారక్ తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని అతను ప్రకటించడం విశేషం. వచ్చే ఎన్నికల సందర్భంగా తారక్ తనకు వీలున్న సమయంలో టీడీపీకి ప్రచారం చేస్తాడని తారకరత్న అన్నాడు.
కానీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాక జరిగిన రకరకాల పరిణామాల తర్వాత తారక్.. పార్టీకి దూరం అయిపోయాడు. గత రెండు ఎన్నికల్లో పార్టీ ఛాయల్లోకే రాలేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లోనూ తారక్ ప్రచారం చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. మరి తారకరత్న అంత ధీమాగా ఎలా తమ్ముడి గురించి స్టేట్మెంట్ ఇచ్చేశాడో?
Gulte Telugu Telugu Political and Movie News Updates