ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన ముందున్న లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ.. రైతులు సంతోషంగా లేరని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు కరవయ్యారన్న ఆయన.. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికే వస్తారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నందునే అవినీతికి సీఎం జగన్ హాలీడే ప్రకటించారని ఆరోపించారు. తనను వారాంతపు రాజకీయ నేత అంటూ కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వారానికి ఒక్కరోజు వస్తేనే… వైసీపీ నేతలు, మంత్రులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
తనకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్లు లేవనీ.. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన వద్ద లేదని పరోక్షంగా సీఎం జగన్పై విమ్శలు గుప్పించారు. సినిమాల్లో నటించి సంపాయించిన కష్టార్జితంతోనే కౌలు రైతులకు సాయం చేస్తున్నానని పవన్ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని విమర్శించారు. పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన.. నీటిపారుదల మంత్రి అని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం లేదన్న పవన్.. తాను ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీని గెలవనివ్వబోనని పేర్కొన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమీషన్లు కొట్టే రకం కాదని, అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates