భారతీయ జనతా పార్టీ ఎనిమిదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. తమకు బలం లేని చోట కూడా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను కొని అధికారాన్ని కైవసం చేసుకోవడం చూస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలహీన పడుతుండడం చూస్తే భవిష్యత్తు భాజపాదే అనిపిస్తోంది. మరో పర్యాయం కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటే ఆశ్చర్యం లేదు.
మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పరిస్థితి దయనీయం. గతంలో ఒకటో రెండో సీట్లయినా వస్తుండేవి కానీ.. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. వార్డు మెంబర్ కూడా గెలిచిన చరిత్ర లేని సోము వీర్రాజు ఆ పార్టీని నడిపిస్తుంటే ఆయన చుట్టూ కూడా అలాంటి ప్రజాబలం లేని నేతలే కనిపిస్తున్నారు. ఇక సోము వీర్రాజు మాటలు, చేష్టలు ఎప్పటికప్పుడు ఎంత కామెడీ అవుతుంటాయో తెలిసిందే.
తాజాగా ఆయనకు రాష్ట్రంలోని సమస్యలేవీ కనిపించనట్లుంది. ఏకంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ మీద ఆయన యుద్ధం ప్రకటించేశారు. తమ దేశంపై ఉగ్రవాద ఆరోపణలు చేసినందుకు ప్రతిగా.. మోడీ గుజరాత్లో మారణకాండను సృష్టించారంటూ భారత ప్రధానిని విమర్శించాడు బిలావల్. ఇందుకు సోము వీర్రాజు శివాలెత్తిపోయి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక 20 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని మోడీపై బిలావల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బిలావల్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ నెటిజన్లకు ఇదో కామెడీ కార్యక్రమంలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలపై, జగన్ సర్కారుపై విమర్శలు చేసే దమ్ము, సమయం లేదు కానీ.. అంతర్జాతీయ సమస్యల మీద సోము వీర్రాజు పోరాడతారా.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని ఒక టౌన్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మీద తెలుగులో విమర్శలు చేస్తే.. నిరసన కార్యక్రమాలు చేపడితే ఏం ప్రయోజనం.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏం లాభం అంటూ ఆయన మీద కౌంటర్లేస్తున్నారు నెటిజన్లు.