వీళ్లు మార‌రు బ్రో!!

కొంద‌రు అంతే.. మార‌రు బ్రో!-ఇదీ.. తెలంగాణ కాంగ్రెస్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు బాహాటంగానే చెబుతున్న మాట‌. దీనికి కార‌ణం.. పార్టీలో ఉన్న సీనియ‌ర్లే! వీరంతా.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌లేరు.. తీసుకువెళ్తామ‌ని చెబుతున్న‌వారిని తీసుకుని వెళ్ల‌నివ్వ‌డ‌మూ లేదు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకోవ‌డానికి త‌ప్ప‌.. పాలించ‌డానికి ప‌నికిరాకుండా పోయిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని మేధావులు హెచ్చ‌రిస్తున్నారు.

రేవంత్ ప‌గ‌!

కాంగ్రెస్ ప్ర‌స్తుత చీఫ్ రేవంత్‌రెడ్డి కేంద్రంగా కొన్ని రోజులుగా పార్టీ సీనియ‌ర్లు.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా రు. ముఖ్యంగా జంబో క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ప్రాధాన్యం లేని ప‌ద‌వుల‌ను త‌మ‌కు క‌ట్ట‌బె ట్టారంటూ..కొండా సురేఖ ఆరోపించ‌డంతో ప్రారంభ‌మైన ఈ అస‌మ్మ‌తి సెగ‌.. ఇప్పుడు సౌమ్యుడిగా పేరున్న భ‌ట్టి విక్ర‌మార్క వ‌ర‌కు పాకింది. వీరంద‌రికీ కంట‌గింపు ఒక్క రేవంత్‌రెడ్డే!

దీనికి కార‌ణం.. ఆయ‌న పార్టీ మారి వ‌చ్చాడు. టీడీపీతో ఇప్ప‌టికి స‌న్నిహిత సంబంధాలు నెరుపుతున్నా డు. అనేది కాదు! చిత్రంగా ఆయ‌న‌కు కీల‌క‌మైన ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే వీరికి బాధ‌. పోనీ తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. చీఫ్‌లుగా చేశారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య సార‌థ్యం వ‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొని అధికారం లోకి వ‌స్తామ‌న్నారు. కానీ, ఏమైంది. ఆయ‌న నాయ‌క‌త్వానికి కూడా గండి కొట్టారు.

త‌ర్వాత బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని కూడా సీనియ‌ర్లు అలానే చేశారు. కేవ‌లం ఆయ‌న‌ను డ‌మ్మీ అంటూ.. ప్ర‌చారం చేశారు. ఎవ‌రికి వారు తామంటే తామ‌ని.. కొట్టాడుకుని.. సొంత ఇంటికి కుంప‌టి పెట్టుకున్న చందంగా.. పార్టీని బ‌జారున ప‌డేసిన వారే త‌ప్ప‌.. మేమున్నాం.. అంటూ.. పార్టీని భుజాన వేసుకుని న‌డిపించిన నాయ‌కులు ఒక్క‌రు కూడా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు కూడా ఎన్నిక‌ల ముందు.. సీనియ‌ర్లు చేస్తున్న రాజ‌కీయంతో పార్టీని న‌ష్ట‌మే కాదు.. వ్య‌క్తిగ‌తంగా వారి ఇమేజ్ కూడా కోల్పోవ‌డం ఖాయం.