ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయకులు మండి పడుతున్నారు. దీంతో నాయకులకు ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర యుద్ధమే సాగుతోంది.
ఇటీవల సత్యసాయి(ఉమ్మడి అనంతపురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో కొందరు కార్యకర్తలు చెప్పులు విసిరిన విషయం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణపై ఉన్న అసంతృప్తిని కార్యకర్తలు తమ చెప్పుల ద్వారా.. చూపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా.. దీనికి ఏకంగా పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులను పిలిచి మరీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.
తాజాగా పుట్టపర్తిలో జరిగిన సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో కనిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.
ఒక చిన్న పాటి సమావేశానికి .. ఇంత భారీగా పోలీసులను రప్పించి భద్రతను ఏర్పాటు చేయడం.. ఇదే తొలిసారి కావడంగమనార్హం. దీనిని గమనించిన పరిశీలకులు.. చెప్పు ఎఫెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates