కొన్ని కొన్ని ఘటనలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే కళ్లకు కడుతు న్నట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటన కూడా ఇదే తరహాలో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రాంతంలోకి అసలు టీడీపీ నేతలు వచ్చేందుకే లేదన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరించారు.
మొత్తంగా చాలా ముందస్తు పథకం ప్రకారమే.. విధ్వంసానికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. టీడీపీ నేతలతో పాటు వారికి అండగా నిలిచిన వారిని సైతం.. భయపెట్టి మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు జరిగాయని చెబుతున్నారు. రాడ్లు పట్టుకుని.. కర్రలు తిప్పుతూ…. ఆటోలెక్కి ఈలలు, కేకలతో హల్‌చల్ చేస్తూ వైసీపీ మూక.. పట్టణంలో మూడు గంటలపాటు భయానక వాతావరణాన్ని సృష్టించింది.
అంతేకాదు.. టీడీపీ నేతల ఇళ్లలోకి వెళ్లి పలుగు, పారలతో తలుపులు పగలగొట్టి అక్కడ విధ్వంసం సృష్టించడం, మహిళలని కూడా చూడకుండా ఇళ్ల నుంచి తరిమేయడం… బంగారం, నగదుతోపాటు ఆస్తుల దోపిడీకి సైతం పాల్పడ్డారు.. దీంతో ఆయా ఇళ్లలోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరారయ్యారు.
ఎందుకు జరిగింది?
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ కార్యాచరణ ప్రకటించడంతో.. వైసీపీ నేతలు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఫ్యాక్షన్ ముసుగులో.. విధ్వంసం సృష్టించాలనే వ్యూహం కన్పిస్తోంది. అందుకు అనుగుణంగానే వైసీపీ కార్యకర్తలతో తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి పంపేశారు. అయితే.. వైసీపీ వారిని అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో విధ్వంసానికి దారి తీసింది.
వచ్చే ఎన్నికలకు రిహార్సల్సా?!
ఔను.. తాజాగా జరిగిన పరిణామాన్ని గమనిస్తే.. వచ్చే ఎన్నికలకు ఇది రిహార్సల్సా? అనే చర్చ జరుగు తోంది. అధికారం చేతిలో ఉంది.. పోలీసు వ్యవస్థ తమ గుప్పిట్లో ఉంది. సో.. ఎన్నికల సమయంలోనూ ఇలానే రెచ్చిపోయినా.. అడిగేనాథుడు ఎవరు ఉంటారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికార మే పరమావధిగా అడుగులు వేస్తున్న వైసీపీ.. దానిని అంది పుచ్చుకునేందుకు. ఎంతటి పరిస్థితికైనా దిగజారుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
దౌర్జన్యాలు.. దాడులతోపాటు.. ప్రజలను బెదిరించడం.. వారిని భయభ్రాంతులకు గురి చేయడం కూడా.. తాజా పరిణామాలతో వైసీపీ నాయకులకు ఎంత ఈజీనో..!! అనే చర్చసాగుతుండడం గమనార్హం. మొత్తంగా మాచర్ల ఘటన రాబోయే ఎన్నికలకు రిహార్సల్సేనా? అనేది.. మేధావుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates