భూమా అఖిల ప్రియ అరెస్టు తప్పదా?


రాజకీయాల్లో ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే. మంత్రిగా వ్యవహరించిన మహిళా నేత.. తన పదవి పోయిన తర్వాత సొంత పార్టీకి చెందిన నేత హత్యకు ప్లాన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొనటం బహుశా భూమా అఖిలప్రియే అవుతారేమో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళా నేతలు ఉన్నా.. హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన నేత ఒకరు ఆరోపణలు చేయటం.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం లాంటివి ఇప్పటివరకూ జరగలేదన్న మాట వినిపిస్తోంది.

అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూమా అఖిల ప్రియ రాజకీయ రంగప్రవేశమే అనూహ్యంగా జరిగిందన్న విషయం తెలిసిందే. కారు ప్రమాదంలో తన తల్లి శోభానాగిరెడ్డి మరణిస్తే.. ఆమె స్థానంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అఖిల.. తర్వాతి కాలంలో హఠ్మాన్మరణం చెందిన తన తండ్రి నాగిరెడ్డి రాజకీయ వారసురాలి ఖాతాలో మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు.

ఒకప్పుడు తన తల్లిదండ్రులకు అత్యంత సన్నిహితంగా వారి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో రాజకీయ వైరాన్ని పెంచుకున్న అఖిలప్రియ.. ఆయన్ను అంతమొందించేందుకు ప్లాన్ చేశారన్న ఆరపణను ఎదుర్కొంటున్నారు.

తనను చంపేయటం కోసం కిరాయి మూకలకు రూ.50 లక్షల మొత్తాన్ని అఖిల ప్రియ భర్త భార్గవ్ రాం ఇచ్చినట్లుగా ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు.. తన కుటుంబానికి భూమా అఖిలప్రియతోనూ.. ఆమె భర్త వల్ల ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరటమే కాదు.. ఒకప్పటి తన నాయకుడి కుమార్తె కారణంగా ప్రాణహాని ఉందని.. ఆమెను అరెస్టు చేయాలని కోరిన ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది ఇప్పడు సస్పెన్స్ గా మారింది.

ఒకవేళ..ఆయన ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని అరెస్టు చేస్తే మాత్రం.. ఇలాంటి ఆరోపణలతో అరెస్టు అయిన మొదటి మహిళా మాజీ మంత్రిగా అఖిల ప్రియ నిలిచిపోవటం ఖాయం.