రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనడం తేలికే. ఎందుకంటే వారు కళ్ల ముందే కనిపిస్తారు. అయితే.. కని పించని శత్రువును ఎదుర్కొనడం.. ప్రతిపక్షాలను మించిన వ్యూహాలతో ముందుకు సాగే.. అయిన వారిని అడ్డుకోవడం.. అంత తేలిక అయితే కాదు. ఊహలకు కూడా అందని విధంగా.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఆయన బావ, క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
అనిల్ కేవలం.. ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తున్నారని అనుకునే పరిస్థితి లేదు. ఆయన వ్యాఖ్యలుయావత్ రాష్ట్రం మొత్తంమీద ప్రభావం చూపడం ఖాయమనేది వైసీపీ నాయకుల అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. అనిల్‌ను ఏ వర్గమైనా .. ఇప్పటి వరకు రాజకీయ నేతగా చూడలేదు. ఆయన కూడా ఎప్పుడూ అలా వ్యవహరించలేదు. పైగా ఒక సామాజిక వర్గంలోను.. ఒక మత విషయంలోనూ ఆయన బలమైన వ్యక్తిగా ఉన్నారు.
ఆయన చెప్పేది తప్పు అని కానీ, కేవలం ఊసుపోక చేస్తున్న విమర్శ అని కానీ ప్రజలు అనుకునే సాహసం చేయలేరు. ఆయనను విశ్వసించేవారు.. ఆయన చెబుతున్నది ఖచ్చితంగా నిజమనే అనుకుంటారు. ఎందుకంటే.. ఆయన గత ఎన్నికల సమయంలోనూ జగన్‌కు అనుకూలంగా ప్రార్థనా సమావేశాల్లోనే పిలుపు నిచ్చిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో.. అనిల్ చెప్పే ప్రతిమాటకు విలువ ఉంది. వంద మంది పనిచేయగా వచ్చిన ఫలితంతో అనిల్ ఒక్కమాట సరితూగుతుంది.
అంటే, ఆయన మాటకు అంత విలువ ఉందనేది వాస్తవం. అందుకే.. గత ఎన్నికల్లో సునాయాసంగా ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఇదే అనిల్ వ్యతిరేక ప్రచారం చేస్తుండడంతో వైసీపీనాయకులు తల్లడిల్లుతున్నారు. ఈయన రాజకీయ నేత అయితే, ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. కానీ, ప్రబోధకుడు. సో.. ఆయనను విమర్శించలేరు. అలాగని మౌనంగానూ ఉండలేరు. అంటే.. మొత్తంగా.. అనిల్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ నేతలకు కక్కలేని మింగలేని పరిస్థితిని తీసుకువచ్చింది. మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates