ఏపీలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుని వైసీపీ విముక్త ఏపీని సాధించాలనేది ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్రమంలో పార్టీకి పెద్దగా బలగం లేదు. ఉన్నదల్లా పార్టీ అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే. నిజానికి టీడీపీని తీసుకున్నా.. చంద్రబాబు ఇమేజ్ ఇప్పటికీ తరిగిపోలేదు.
అదేవిధంగా వైసీపీని తీసుకున్నప్పటికీ.. జగన్ ఇమేజ్‌కు వచ్చిన ఢోకా లేదనే విశ్లేషణ ఉంది. సో.. ఇప్పుడు పవన్‌కు కానీ, పార్టీకి కానీ కావాల్సింది.. ప్రజల నుంచి వచ్చే నాయకులు.. ప్రజలు మెచ్చే నాయకులు. ఈ విషయంలో మొహమాటాలకు తావు లేకుండా చెప్పాలంటే.. పవన్ వెనుక బడ్డారనే చెప్పాలి. మరో ఏడాదిన్నరలో ఉన్న ఎన్నికలకు సంబంధించి ఈయనకు ఉన్న బలాన్ని లెక్కేసుకుంటే.. చాలా చాలా తక్కువనే చెప్పాలి.
ఇటు వైసీపీని తీసుకున్నా.. అటు టీడీపీని తీసుకున్నా.. చాలా బలమైన నాయకులు రంగంలో ఉన్నారనే చెప్పాలి. టీడీపీలో కొంత నిద్రణ స్థితి ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయానికి నాయకులు పుంజుకోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇక వైసీపీ నాయకులను సీఎం జగన్ ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్థికంగానూ ఈ నేతలు బాగానే ఉన్నారు. టీడీపీ, వైసీపీనాయకులు బలంగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 120. ఇక్కడ సమ ఉజ్జీలుగా ఉన్న నేతలు కనిపిస్తున్నారు.
మిగిలిన 55 నియోజకవర్గాల్లో కొన్ని టీడీపీకి ఏకపక్షంగా ఉంటే.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో.. రాష్ట్రంలో ఈవిధమైన పరిస్థితి ఉంటే జనసేన కేవలం పవన్ ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకుని ముందుకు సాగుతోంది. నిజానికి గత 2014 ఎన్నికల్లోనే పవన్ ఇమేజ్ ప్రభావం చూపించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కేవలం తన ఇమేజ్‌తోఒనే ముందుకు సాగుతానంటే.. ఒనగూరే ప్రయోజనం తక్కువని, కాబట్టి.. ముందుగానే నేతా గణ సమీకరణ, నియోజకవర్గాల లక్షణాలు.. ప్రజల మూడ్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటేనే ఫలితం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates