తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. తన జాతీయ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఎందుకంటే.. ప్రస్తుతం డిల్లీలో ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే 2024 సార్వత్రిక సమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్ని రాష్ట్రాల్లోనూ కలియదిరుగుతారు. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ముందుగా ఈ జాబితాలో ఏపీ ఉందని అంటున్నారు. పొరుగునే ఉన్నరాష్ట్రం.. పైగా తనకు తెలిసిన రాజకీయ నేతలు మెండుగా ఉన్న రాష్ట్రం కావడంతో కేసీఆర్‌కుఏపీ చాలా తేలికగా అందివచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టి.. ఉత్తరాంధ్ర, రాయలసీమలపై ఫోకస్ పెడతారని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఆయన ఇక్కడ కు వస్తే.. ప్రజలకు ఏం చెబుతారు? అనేది ప్రధాన సమస్య. ఎందుకంటే.. అనేక విషయాలపై ఇప్పటికీ.. ఇక్కడ సమస్యలు అలానే ఉన్నాయి. రెండు రాష్ట్రాలతో ముడిపడిన విషయాలు సహా.. వ్యక్తిగతంగా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని ఆయన తప్పించుకుని పోవాలని అనుకున్నా.. ప్రజలు మాత్రం ప్రశ్నలు సంధించడం ఖాయం. సో.. ఆయన ఎలాంటి వైఖరి అవలంభిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
ఉదాహరణకు.. రాజధాని అమరావతి విషయం. ఇక్కడ రైతులు.. మూడు సంవత్సరాలుగా 2020 నుంచి పోరు సల్పుతున్నారు. సో.. వారికి ఆయన ఏం చెబుతారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాబట్టి.. దీనిపై స్పందించినా స్పందించకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. కానీరేపు ఆయన జాతీయ పార్టీ నాయకుడిగా వచ్చిన తర్వాత.. ఇక్కడి రైతులుఆయనకు ఈ విషయం విన్నవిస్తే.. ఏం చెబుతారు? ఒకవైపు జగన్ మూడురాజధానులు అంటున్నారు. మరోవైపు రైతులు అమరావతి కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెబుతారో చూడాలి.
ఇక, పోలవరం ప్రాజెక్టు. ఈ విషయంపైనా కేసీఆర్ ఏం చెబుతారో అనేది మేధావుల మాట. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేనా.. కాదా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఈ ప్రాజెక్టుపై గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్లింది. సో.. ఈ విషయంలో జాతీయ పార్టీ నాయకుడిగా ఆయన ఉద్దేశం ఏంటి. అనేది కూడా ఇప్పుడు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక, రెండురాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలను ఎలా పరిష్కరిస్తారు? ఉద్యోగుల విభజనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..ఇలా.. అనేక సమస్యలకు కేసీఆర్ ఏం చెబుతారో.. అనేది ప్రశ్నగానే ఉండడం గమనార్హం. మరి చూడాలి.. మాటల మాంత్రికుడు ఏపీలో అడుగు పెట్టి ఏం చేస్తారో .. అంటున్నారు మేధావులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates