కేసీఆర్ కు మైండ్ బ్లాక్ చేసిన ఆ ఇద్దరు

తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజ‌కీయాల‌పై చాలానే ఉత్సాహం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌చ్చే మూడు నాలుగు నెల్ల‌లోనే దేశ‌వ్యాప్తంగా చుట్టేసి.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ ఎస్ జాతీయ భ‌వనాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేశారు. అయితే..ఇక్క‌డ ఆదిలో అనుకున్నంత ఈజీగా ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్‌కు పోటీగా ఇద్ద‌రు నాయ‌కులు కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.

అయితే, వీరివెనుక ఎవ‌రో ఉన్నార‌నే వాద‌న కూడా బ‌లంగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా.. బీజేపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. త‌మ‌కు నొప్పి క‌లుగుతుంద‌ని, త‌మ‌కు దెబ్బ త‌గులుతుంద‌ని భావిస్తే వెంట‌నే వ్యూహాన్ని మార్చుతూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ త‌మ‌కు ఎలాగూ.. దెబ్బ వేస్తాడ‌ని అనుకుంటున్న బీజేపీ, ప‌క్కా వ్యూహంతో ఇద్ద‌రు నేత‌ల‌ను రంగంలోకి దింపుతోంద‌నే విశ్లేష‌ణ‌లు ఢిల్లీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. స‌రే.. వీరి వెనుక ఎవ‌రు ఉన్నారు? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం వారి రాజకీయాలు మాత్రం చ‌ర్చ‌కు వస్తున్నాయి.

వీరిలో ఒక‌రు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌. ఈయ‌న జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకురెడీ అవుతున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌తో క‌లిసి ఆయ‌న మోడీపై పోరు చేస్తాన‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు సొంత‌గానే జాతీయ స్థాయిలో రాష్ట్ర పార్టీల‌ను క‌లుపుకొని పోతాన‌ని చెబుతున్నారు. అందుకే.. తాజాగా కేసీఆర్ త‌న బీఆర్ ఎస్ భ‌వ‌న్ ప్రారంభానికి నితీష్‌ను ఆహ్వానించ‌లేద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, నితీష్‌ మిత్ర ప‌క్షం ఆర్జేడీ నుంచి డిప్యూటీ సీఎం తేజ‌స్వి మాత్రం బీఆర్ ఎస్ ఆహ్వానాన్నిమ‌న్నించారు.

మ‌రోవైపు బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని అనుకున్నా.. ఇప్పుడు ఆమె నితీష్ వైపు చూస్తున్నార‌ని స‌మాచారం. దీంతో బీఆర్ ఎస్ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి కూడా ఆమెకు ఆహ్వానం అందిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక‌, జార్ఖండ్ సీఎం హేమంత్ కూడా నితీష్ వైపు చూస్తున్నార‌ని అంటున్నారు. అంటే.. ప్ర‌ధాని పీఠం అలా ఉంచితే.. జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ఎవ‌రినైతే క‌లుపుకొని వెళ్లాల‌ని అనుకున్నారో..ఇప్పుడు వారంతా కూడా నితీష్‌వైపు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, మ‌రో నేత‌.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఈయ‌న కూడా కేసీఆర్‌తో క‌లిసి వ‌స్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. కానీ, గుజ‌రాత్‌లో 5 సీట్లు గెలుచుకోవ‌డం, ప్ర‌జ‌ల్లో పుంజుకోవ‌డంవంటి ప‌రిణామాల త‌ర్వాత ఆయ‌న కూడా సొంత‌గానే జాతీయ స్థాయిలో ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. ఈయ‌న‌కుఎవ‌రితోనూ సంబంధం లేదు. త‌నే స్వంత‌గా జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు చేసి.. కుదిరితే ప్ర‌ధాని పీఠం ఎక్కే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

అంటే.. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌తో క‌లిసివ‌స్తామ‌ని చెప్పిన‌వారంతా.. ప‌క్క చూపులు చూడ‌డం, కేసీఆర్‌కు పోటీగా నాయ‌కులు తెర‌మీదికి రావ‌డం వంటి ప‌రిణామాలు.. కేసీఆర్‌కు జాతీయ రాజ‌కీయం అంత ఈజీకాద‌నే సంకేతాలు ఇస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.