ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడ్డాయా? విశాఖకు రాజధానిని తరలించే ప్రక్రియలో భాగంగా.. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ప్రతిపాదనలు ఓకే అయ్యాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా .. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని..ముఖ్యంగా విశాఖకు వెళ్లిపోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన అడుగులు వేయాలన్నా.. తీయాలన్నా.. న్యాయవ్యవస్థ కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే.. ఇటీవల సుప్రీంకోర్టును ఒప్పించే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు.
ఇదిలావుంటే, తక్షణం విశాకకు వెళ్లిపోవాలన్న వైసీపీ సర్కారు వ్యూహంలో భాగంగా తాజాగా కేబినెట్ ఒక కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. రాజధాని తరలింపులో భాగంగా.. ముందుగా.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తొలుత దీనిని తరలించాలన్న ప్రతిపాదనను మంత్రులు ఓకేచేశారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 11న సీఎంవో విశాఖకు తరలిపోతుందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.