ఢిల్లీకి కేసీఆర్‌.. వారికి స్పెష‌ల్ ఫ్లైట్లు?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కొత్త‌గా నిర్మించిన జాతీయ పార్టీ బీఆర్ ఎస్ కార్యాల‌యాన్ని ఆయ‌న‌ ఈ నెల 14వ తేదీన అట్ట‌హాసంగా ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు.

అయితే, బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ నుంచే కాకుండా.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, బిహార్‌, యూపీల నుంచి కూడా ప‌లువురు కీల‌క నేత‌ల‌ను కేసీఆర్ ఆహ్వానించారు.

అయితే, వారు వ‌చ్చేందుకు, వెళ్లేందుకు ప్ర‌త్యేకంగా ఫ్లైట్లు బుక్ చేసిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క‌ర్ణాట‌క నుంచి ఒక‌టి, తెలంగాణ నుంచి 13వ తేదీ మ‌ధ్యాహ్నం ఒక‌టి, త‌మిళ‌నాడు నుంచి అదే రోజు ఉద‌యం ఒక ప్ర‌త్యేక విమానం ఢిల్లీ వెళ్ల‌నుంద‌ని.. దీనిలో ఎంపిక చేసిన కొంద‌రు జాతీయ నాయ‌కులు, సీపీఐ నేత‌లు కూడా వెళ్తున్నార‌ని తెలుస్తోంది. వీరికి రాను పోను ఖ‌ర్చుల‌తో పాటు.. ఢిల్లీలో ప్రత్యేక వ‌స‌తి ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి.

ఢిల్లీలోని సర్దార్ పటేల్‌మార్గ్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ అదే రోజు యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ‌ మంత్రి వేముల‌ ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్‌ వంటి వాటిని పరిశీలించారు. ఇక‌, అదేరోజు లేదా తెల్ల‌వారి కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్టు తెలుస్తోంది.