విజయమ్మ ఆ మాట అన్నాకే కేవీపీ బయటపడ్డారా ?

KVP

ఒక వ్యక్ తిపై లేదా ఒక ప్రభుత్వం పై అసంతృప్తి రాత్రికి రాత్రే బయటపడదు. అది క్రమంగా బయటపడే మానసిక వ్యవస్థ. అదే విధంగా ఒక నాయకుడి పై కూడా అభిమానం లేదా వ్యతిరేకత ఒకరు చెప్పినప్పుడు బయటకు వచ్చేది కాదు. పరిణామాలు గమనించాలి, నాయకుడు చేస్తున్న తప్పులను అర్థం చేసుకోవాలి. తప్పులు హద్దు మీరుతున్నాయన్న నిర్ణయానికి రావాలి. అప్పుడే విమర్శించాలి, తప్పులను బయట పెట్టాలన్న కోరిక కలుగుతోంది. అది అసంతృప్తిగా, ఆగ్రహంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో మనకెందుకులే అని కూడా వదిలేస్తుంటారు. జగన్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా అదే పని చేసి ఉండొచ్చని చెబుతున్నారు..

కేవీపీ, వైఎస్ కు అంతరాత్మ అనేవారు. ఇద్దరు కలిసి చదువుకున్నారు.. కాంగ్రెస్ లో కలిసి పనిచేసేవారు. వైఎస్ తో ఏదైనా పనిచేయించుకోవాలంటే కేవీపీతో చెప్పిస్తే సరిపోతుందనేవారు. అలాంటి కేవీపీ .. జగన్ పార్టీ పెడితే ఆయనతో చేరలేదు. ఆ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరైనా రాజకీయ నిరుద్యోగులు తన వద్దకు వచ్చి వైసీపీలో చేరడంపై సలహా అడిగితే …అల్లుడికి మీకు కుదరదులే వద్దనే వారు. అల్లుడి ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు అని చెప్పేవారు. జగన్ కూడా ఎప్పుడూ కేవీపీని పిలిచిన దాఖలాలు కనిపించలేదు.

వైఎస్ కుటంబంపై కేవీపీకి అభిమానం ఎక్కువ, వైఎస్ సతీమణి విజయమ్మ అంటే గౌరవం. జగన్ ఒంటెత్తు పోకడ బాగానే తెలుసు. అందుకే వారితో పెట్టుకోకుండా, ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. వైసీపీ వారి అరాచకాలు, అవినీతి, రాజకీయ ప్రత్యర్థులను వాళ్లు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును చూసి కేవీపీ కాస్త నొచ్చుకున్న మాట వాస్తవం. అయినా మౌనం వహించారు. అలాంటి కేవీపీ ఇప్పుడు నోరు తెరిచారు. జగన్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు.

విభజన హామీల కోసం జగన్ పోరాడటం లేదని కేవీపీ ఆరోపించారు. బంగారు భవిష్యత్తు కలిగిన ఆంధ్రప్రదేశ్ పాలనను చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారన్నారు. పోలవరం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. ఇంకా చాలా మాటలే అనేశారు. నిజానికి ఈ సమస్యలు చాలా రోజులుగా ఉన్నవే. అయినా కేవీపీ ఎన్నడూ విమర్శించలేదు.. జగన్ పార్టీలో విజయమ్మ ఉన్నారనే కేవీపీ వెనుకాడినట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆమె నొచ్చుకుంటారని కేవీపీ మాట్లాడలేదని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఆ రాష్ట్రంతో మాకేమీ పని అని ఏపీని ఉద్దేశించి పెద్ద కామెంటే చేశారు. తనయుడు జగన్ తో విజయమ్మ తెగదెంపులు చేసుకున్నారని, కూతురు షర్మిల రాజకీయ జీవితం కోసమే ఫుల్ టైమ్ పనిచేయబోతున్నారని కేవీపీకి అర్థమైంది. ఇక పై జగన్ ను విమర్శిస్తే విజయమ్మ ఫీలయ్యేదేమీ లేదని నిర్థారణకు వచ్చిన తర్వాతే కేవీపీ వాగ్బాణాలు మొదలు పెట్టారనుకోవాలి.

ఏపీ దౌర్భార్యానికి కారణమైన అన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ముందు ముందు కేవీపీ చాలా విషయాలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి నుంచి జగన్ తీరు ఎలా ఉండేదో కూడా ఆయన వివరిస్తారనుకోవాలి. ఫ్యామిలీ ఫ్రెండ్ కదా మరి…