వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్.. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వివాదాలు.. విభేదాల్లో ఉన్న నాయకులను ఆయన పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాకు చెందిన బీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టికెట్ కష్టమనే ప్రచారం సాగుతోంది.
ఇటీవల ఆయనను పార్టీ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. తర్వాత ప్రాధాన్యం లేకుండా చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికి కారణం వరుస వివాదాలేనని అంటున్నారు. గతంలో గంట.. అంటూ ఒక ఆడియో క్లిప్ రాగా.. తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు.
ఇక, ఇటీవల మరో ఆడియో కూడా కలకలం రేపింది. హైదరాబాద్‌లో ఉన్న లేడీ ఫ్రెండ్‌కు అవంతి ఫోన్ చేశారనే సంభాషణలు కలకలం రేపాయి. ఈ పరిణామాల తర్వాత పార్టీలో కీలక బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. ఈ రెండు ఘటనలను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని అందుకే ఆయనకు పదవీ భంగం కలిగిందనే ప్రచారం ఉంది.
ఇక, మరోవైపు.. విశాఖపట్నంలోని ముఖ్యనాయకులకు, అవంతికి మధ్య గ్యాప్ అలానే ఉంది. తనను విజయ సాయిరెడ్డి డామినేట్ చేస్తున్నారని, అప్పట్లో మంత్రిగా ఉన్నా.. తనను పట్టించుకోలేదని అనేవారు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. పోనీ ఆయనైనా అవంతి విషయంలో సానుకూలంగా ఉన్నారా? అంటే, లేదు. కనీసం ఆయన కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ మంత్రి అవంతికి వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమనే అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. అయితే, ఆయనకు పార్టీలు మారడం కొత్తకాదు. గతంలో టీడీపీ, తర్వాత ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ. సో.. రేపు మళ్లీ పార్టీ మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.