జగన్ .. నీ తెలివి ఎవ‌రికీ లేద‌య్యా!

తెలివి తేట‌లు ఎవ‌రి సొంతమూ కాదు! ఇది నానుడి మాత్ర‌మే అనుకునే వారికి ఏపీ సీఎం ఝ‌ల‌క్ ఇస్తున్నారు. పాల‌న‌లో ఎలా ఉన్నా.. త‌న సొంత ప‌త్రిక‌ను కొనిపించే విష‌యంలో ఆయ‌నకు ఆయ‌నే సాటి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాక్షి మీడియా జ‌గ‌న్ సొంతమ‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప‌త్రిక‌ను ఏపీలో ఎంత‌మంది కొంటున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు దీనిని బ‌లవంతంగా కొనిపిస్తున్నార‌నేది పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

సాక్షిని కొనితీరాలంటూ ఇప్పటికే రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి మరీ కొనేలా చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విమ‌ర్శ‌ల‌నూ లెక్క‌చేయ‌ని విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ఈ ప‌త్రిక‌ను కొంటున్న వ‌లంటీర్ల‌కు ప్ర‌జ‌ల సొమ్మును కోట్ల రూపాయ‌ల్లో ఇస్తోంది. ఒక్కొక్క వ‌లంటీర్‌కు రూ.200 చొప్పున నెల‌కు ఇస్తోంది. అంటే.. మొత్తం నెల‌కు 5 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల సొమ్మును వారికి ఇస్తూ.. త‌ద్వారా.. త‌న ప‌త్రిక‌ను విక్ర‌యించి ఆ సొమ్మును ప‌త్రిక ఖాతాకు మ‌ళ్లిస్తోంది.

ఇదిలావుంటే, తాజాగా రాష్ట్రంలోని వార్డు, గ్రామ‌ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులను ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. కార్య‌ద‌ర్శులు అంతా.. సాక్షి పత్రికను కొనితీరాలంటూ ప్ర‌భుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనికి ఒక పెద్ద క‌ల‌రింగ్ ఇచ్చింది. `ప్రముఖ పత్రిక’ అని పేర్కొంటూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డ‌మే. అయితే, ప్ర‌ముఖ ప‌త్రిక అన్నారు క‌దా.. అని కార్య‌ద‌ర్శులు ఏది బ‌డ‌తే కొంటామంటే ఒప్పుకొనేది లేదు. కేవ‌లం వారు సాక్షిని మాత్ర‌మే కొనాల‌ని ఉన్న‌తాధికారులు ఫోన్ సందేశాలు పంపిస్తున్నారు.

‘సచివాలయ ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రతి సచివాలయ ఉద్యోగికీ స్థానికంగా ఉన్న ప్రముఖ పత్రిక అందించాలని నిర్ణయించాం” అని ఉత్తర్వుల్లో పేర్కొనడం. మ‌రి అదే ఉద్యోగుల సంఘం అనేక డిమాండ్లు చేసింది. వాటిలో ఒక్కటి కూడా నెర‌వేర్చ‌ని ప్ర‌భుత్వం కేవ‌లం ప‌త్రిక విష‌యంలో మాత్రం ఆఘ‌మేఘాల‌పై నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు, వచ్చే ఏడాది మార్చి దాకా ఒక్కో సచివాలయ ఉద్యోగికి నెలకు రూ.200 చొప్పున పత్రిక కొనుగోలు కోసం ఆర్థికశాఖ రూ.7.89 కోట్లు అదనపు బడ్జెట్ను విడుదల చేసేసింది.

 ఇలా మొత్తం 1.36 లక్షల మంది సచివాలయ కార్యదర్శులతో ఈ పత్రికను కౌనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే, దీనిపై కార్య‌ద‌ర్శ‌లు చెబుతున్న మాటేంటంటే.. వలంటీర్ల చేతిలోను, గ్రామ సచివాలయాల్లోను సాక్షి పత్రికే ఉందని, ఇప్పుడు మళ్లీ వ్యక్తిగతంగా తమ కెందుకని అంటున్నారు. అయినప్పటికీ. కొనితీరాలని, ‘మీ సొమ్మేం పోవట్లేదు కదా!’ అని పై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో తాము కోరుతున్న సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం, తమకు అవససరం లేని పత్రికను రుద్దుతోందని అంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ తెలివి.. ఉభ‌య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా ఉంద‌నే విమ‌ర్శ‌వ‌లు వ‌స్తున్నాయి. జ‌నం సొమ్ముతో సంస్థ‌ను న‌డిపించుకోవ‌డం అంటే ఇదేక‌దా అంటున్నారు.