తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అనుకున్నది సాధించే ఘటంగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ ఉద్యమ పార్టీని తర్వాత.. కాలంలో రాజకీయ పార్టీగా మార్పు చేశారు. రాష్ట్ర సాధన అనంతరం.. టీఆర్ ఎస్‌ను పొలిటికల్ పార్టీగా మార్చినట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక, ఇప్పుడు అదేపార్టీని జాతీయ రాజకీయాల కోసం.. భారత రాష్ట్రసమితిగా మార్చారు.
దీనికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసే కార్యక్రమం కూడా పూర్తయింది.ఖచ్చితంగా పెట్టుకున్న ముహూర్తానికి.. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. దీంతో సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో అలుపెరుగని సంచలనాలు సృష్టించిన టీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోయి.. జాతీయ రాజకీయ యవనిక పై సరికొత్త పార్టీ బీఆర్ ఎస్ రూపంలో పురుడుపోసుకున్నట్టు అయింది. అనంతరం.. బీఆర్ ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.
అయితే.. పార్టీ బీఆర్ ఎస్‌గా మారినా.. జెండా మారలేదు. కేవలం జాతీయ అజెండానే మారడం గమనార్హం. పార్టీ జెండాను గులాబీ రంగులోనే రూపొందించారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత్‌దేశం మ్యాప్‌ను చేర్చారు. అదేవిధంగా పార్టీ జెండాపై జై తెలంగాణ
బదులు.. జై భారత్
గా మార్చారు.
జెండా ఆవిష్కరణ ముందే కండువా
ను ఆవిష్కరించిన కేసీఆర్.. తనకు తానుగా కండువాను మెడలో వేసుకున్నారు. అనంతరం ఆయన ఎన్నికల సంఘం పంపించిన లేఖపై సంతకాలుచేసి.. లాంచనంగా పార్టీని ప్రారంభించారు. ఇక, కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్న కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు.