ఏపీలో అధికార పార్టీ వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందనే వార్తలు తరుచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ముందస్తే కాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తామురెడీగానే ఉన్నామని చెబుతున్నారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఉండదని.. 18 నెల్లలో వచ్చే సార్వత్రిక సమరమే ఉంటుందని చెబుతున్న విషయం తెలిసిందే.
అయితే, తాజాగా బీజేపీ కీలకనాయకుడు సత్యకుమార్ మాత్రం ఏపీలో ముందస్తుపై కీలక సమాచారం వెల్లడించారు. ఖచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. అంతేకాదు.. తారీకులు , దస్తావేజులు అంటూ.. కొన్ని నెలలు కూడా ఆయన చెప్పుకొని రావడం సంచలనంగా మారింది.
వైసీపీ పూర్తి కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని తెలిసే.. ముందస్తు వ్యూహానికి సీఎం జగన్ పావులు కదుపుతున్నారని సత్యకుమార్ అన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే వైసీపీ ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సన్నద్ధమవుతోందని, దీనికి సంబంధించిన పక్కా సమాచారం తన దగ్గర ఉందని ఆయన వెల్లడించారు.
ఎన్నికలంటే యుద్ధమని అభివర్ణించిన జగన్.. ముందుస్తు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రానున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలైనా వెదజల్లి గెలిచేప్లాన్ చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఇది జరిగిన మరుక్షణం.. అంటే.. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా ముందస్తుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని సత్యకుమార్ చెప్పారు.