కారు నుంచి క‌ట్ డ్రాయ‌ర్ వ‌ర‌కు.. వైసీపీ పై ప‌వ‌న్ ఫైర్‌

ఒక్క మాట‌ని వంద అనిపించుకోవ‌డం అంటే ఇదేనేమో..! అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న కామెంట్లుకు అంతే వేగంతో ప‌వ‌న్ కూడా రియాక్ట్ అవుతున్నారు. వారు ఒక‌టంటే.. ప‌వ‌న్ వంద అనేస్తున్నాడు. తాజాగా మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఇప్ప‌టికీ కౌంట‌ర్లు ఇస్తూనే ఉన్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహ‌నం వారాహి రంగులపై పేర్ని నాని చేసిన‌ విమర్శలకు వ‌రుస‌గా పవన్‌ కల్యాణ్ రియాక్ట్ అవుతున్నారు.

తాజాగా ఆయ‌న కామెంట్ చేస్తూ.. అసూయ‌తో మీ ఎముక‌లు కుళ్లిపోతున్నాయ్‌ అని వ్యాఖ్యానించారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశారు. వారాహి రంగుతో ఆలీవ్ గ్రీన్‌కలర్‌లో ఉన్న మిగతా వాహనాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా అని ప్రశ్నించారు. ముందు తన సినిమాలను అడ్డుకున్నారన్న పవన్‌.. ఆపై విశాఖ వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు.

పచ్చని చెట్లు ఉన్న ఫొటోను పవన్ ట్వీట్ చేశారు. ‘వైసీపీ.. ఈ చిత్రం నుంచి మీకు ఏ గ్రీన్ వేరియంట్ ఓకే?.. కారు టూ కట్ డ్రాయర్’ అంటూ పవన్‌ సెటైర్లు వేశారు. టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపాలని, ఏపీ అభివృద్ధిపై వైసీపీ సర్కార్‌ దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ లంచాలు, వాటాలు, వేధింపుల వల్లే.. కారు టూ కట్ డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రానికి వెళ్లాయని తెలిపారు. అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయని పవన్‌కల్యాణ్ ఎద్దేవా చేశారు.