ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్రకు తెరతీసింది. ఢిల్లీ గలీలో పుట్టిన ఆ పార్టీ ఇప్పుడు జాతీయ హోదా పొందింది. దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు రాని హోదా.. పదేళ్లలో ఆప్ సాధిస్తోంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టిన ఈ రాజకీయ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్ కు వస్తరించింది. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత గోవాలో పోటీ చేసింది. గెలవకపోయినా రెండు స్థానాలు సాధించి ఉనికిని చాటుకుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో పోటీ చేసింది. హిమాచల్ లో ప్రభావం చూపలేకపోయినా గుజరాత్ లో 12 శాతం ఓట్లు సాధించింది. ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే.. ఆ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి; లేదా నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 2 శాతం సీట్లలో కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుపొంది ఉండాలి. వీటిలో మొదటి రెండు నిబంధనల ద్వారా ఆప్ జాతీయ పార్టీ అయ్యింది. ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. గోవాలో రెండు సీట్లలో నెగ్గి, 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో 5 స్థానాల్లో గెలుపొందింది. అంటే నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. జాతీయ హోదా ఉన్న పార్టీల్లో ఆప్ ఎనిమిదవదిగా చెప్పుకోవాలి.
టీడీపీ, టీఆర్ఎస్ సంగతేంటి
ఆప్ కంటే ఎక్కువగా జాతీయ హోదా కోసం పరితపిస్తున్న వాటిల్లో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీలున్నాయి. తమది జాతీయ పార్టీ అవుతుందని టీడీపి అధినేత చంద్రబాబు ప్రకటించి చాలా రోజులైంది. ఇప్పుడు బీఆర్ఎస్ తో జాతీయ హోదా కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అప్పటో తన బలమేంటో తెలుసుకోకుండానే చంద్రబాబు ఒక డైలాగ్ వదిలారు. ఆ మాట చెప్పిన తర్వాత ఏపీలో ఓడిపోయారు తెలంగాణలో బలం పుంజుకోలేకపోయారు. జాతీయ హోదా కోసం కలలుగన్న టీడీపీ వేరే ఏ రాష్ట్రంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలోనూ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. జాతీయ హోదాపై ఆశలు వదులుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు నెలలు బీఆర్ఎస్ ను గాడిలో పెట్టిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పోటీపై కేసీఆర్ తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉండొచ్చు. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేస్తారా.. ఉత్తరాదిన కూడా ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతారా చూడాలి…
ఆప్ కు తెలుగు రాష్ట్రాల పార్టీలకు తేడా ఉందా…
ఆప్ తొలుత ఢిల్లీలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ గెలిచి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పట్లో ఆప్ ను కొట్టడం కుదరదని రాజధాని పార్టీలు డిసైడైన తర్వాతే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఈ లోపే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆప్ కు శాఖలు వచ్చాయి. పంజాబ్ లో గెలుపు ఆప్ కు కొత్త జోష్ ఇచ్చింది. గోవాలో ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా ఆప్ లబ్ధి పొందింది. గెలవకపోయినా తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలతో అక్కడ కూడా ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు పొందుతోంది. తెలుగు పార్టీలు ఇంకా ఆ స్థితికి ఎదగలేదు. విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నాయంతే..
ఆప్ కు ఉన్న అవకాశాలు వేరు . తెలుగు పార్టీల స్థితిగతులు వేరు. ఆప్ ఉత్తరాది పార్టీగా మొదలైంది. ఇంకా ఉత్తరాదిలోనే ఉంది. ఉత్తరాది జనాభా దక్షిణాది పార్టీలను ఆమోదిస్తారన్న నమ్మకమూ లేదు. ముందు ఈ రెండు పార్టీలు దక్షిణాదిలో ఏ మేర రాణిస్తాయో చూడాలి. తమిళ ఫీలింగ్ ఎక్కువగా ఉండే తమిళనాడులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. అక్కడి చిన్న చితకా తెలుగు పార్టీలే కుంటినడక నడుస్తున్నాయి. కేరళలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ను కాదని జెండా పాతడం కష్టం. కర్ణాటక ముందే బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఉత్తరాది ఓటర్లను నమ్మించడం అంత సులభం కాదు. ఇప్పటికే అక్కడ చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి. సంస్థాగతంగా బలపడ్డాయి. అక్కడ ఓట్లు చీల్చి లబ్ధి పొందాలంటే ఆలీబాబా అద్భుత దీపాన్ని బయటకు తీయాలి. భారీ హామీలు ఇచ్చి, వాటిని అమలు చేస్తారన్న విశ్వాసం కల్పించాలి. మరి టీడీపీ, టీఆర్ఎస్ ఆ పని చేయగలుగుతాయో లేదో…