4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ఇటీవల లాక్ అయ్యింది. అయితే ఇప్పటివరకు కాంచన సిరీస్‌లో దేనికి కూడా నిర్మాతగా వ్యవహరించని లారెన్స్ ఈసారి మాత్రం సొంత డబ్బుతో రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాంచన ప్రాజెక్టులలో ఏది కూడా ఇప్పటివరకు నిర్మాతలకు నష్టాలు తీసుకు రాలేదు.

ప్రతీ సినిమా కూడా ఊహించని ప్రాఫిట్స్ అందించాయి. చివరగా వచ్చిన కాంచన 3 డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాన్ని కలిగించింది కానీ నిర్మాతలకు మాత్రం లాభలే అందించింది. కాంచన 1 – 2 రెండు కూడా లారెన్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్. అయితే రెమ్యునరేషన్ పరంగా లారెన్స్ కు వచ్చిన లాభం తక్కువే. అందుకే ఈసారి రిస్క్ తీసుకొని ప్రాఫిట్స్ మొత్తం తనే తీసుకునేలా ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు.

హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, ఎమోషన్, యాక్షన్ ను పర్ఫెక్ట్ గా కలగలిపే ఏకైక దర్శకుడు లారెన్స్. అతని కంటెంట్ క్లిక్కయితే కాసుల వర్షం కురవడం గ్యారెంటీ. ఇక 2025 ఏప్రిల్ లేదా మే నెలలో కాంచన 4 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ సిరీస్‌లో ఇప్పుడు పూజా హెగ్డే కథానాయికగా చేరనున్నట్లు కోలీవుడ్ లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈమధ్య వరుస ఫ్లాప్స్ తో టాలీవుడ్ లో పట్టు కోల్పోయిన పూజ కోలీవుడ్ లో మాత్రం ఆఫర్స్ బాగానే అందుకుంటోంది.

పూజా హెగ్డేకి ఇది జాక్ పాట్ లాంటి ఆఫర్ అని చెప్పవచ్చు. అమ్మడు గత కొంతకాలంగా పెద్ద ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. 2025లో ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. సూర్య నటిస్తున్న ‘సూర్య 44’ తో పాటు విజయ్ హీరోగా నటిస్తున్న ‘థలపతి 69’ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ‘కాంచన 4’ లో నటించే అవకాశం రావడంతో బుట్టబొమ్మ బ్రాండ్ కి మరో ఐదేళ్ళ వరకు డోకా లేదు.