రమణ గోగుల.. 2000 సంవత్సరానికి అటు ఇటు ఓ పదేళ్ల పాటు తెలుగు సినిమా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మ్యుజీషియన్. విదేశాల్లో ఉన్న అతను ‘ప్రేమంటే ఇదేరా’తో సంగీత దర్శకుడిగా పరిచయమై.. యువరాజు, తమ్ముడు, బద్రి, జానీ, లక్ష్మి, మౌనమేలనోయి లాంటి మ్యూజిక్ హిట్లతో అప్పటి యువతను ఒక ఊపు ఊపేశాడు. ఐతే తర్వాత దేవిశ్రీ ప్రసాద్, చక్రి, తమన్ లాంటి యువ సంగీత తరంగాల జోరును తట్టుకోలేక ఆయన కనుమరుగైపోయారు.
గత పదేళ్లలో రమణ గోగుల ఏ చిత్రానికీ సంగీతం అందించలేదు. ఆయన్ని అందరూ మరిచిపోయారు. ఇలాంటి సమయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ దర్వకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. అనూహ్యంగా రమణ గోగులను తెరపైకి తీసుకొచ్చి ఒక పాట పాడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అనుకోకుండా ఈ పాట పాడిన రమణ గోగుల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ను ఒక ఊపు ఊపేస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో మధుప్రియతో కలిసి రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు మీద..’ పాట ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్‌లో మోత మోగిపోతోంది.
ముందు ఈ పాట విని మామూలుగానే ఉంది కదా అనుకున్నారు కానీ.. ఇది నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తోంది. సింపుల్‌గా అనిపిస్తూనే మంచి బీట్‌తో జనాలు పాడుకునేలా, స్టెప్పులేసేలా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ అయిపోతోంది. ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది రమణ గోగుల వాయిసే అనడంలో సందేహం లేదు.
‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో వెంకీకి సంగీత దర్శకుడిగా మరపురాని ఆల్బం ఇచ్చిన రమణ గోగుల.. ఇప్పుడు ‘గోదారి గట్టు మీద..’ పాటతో సింగర్‌గా గుర్తుండిపోయే పాటను అందించాడు. ఇంత గ్యాప్ తర్వాత వచ్చి ఇలా ఒక పాటతో ఊపేయడం రమణ గోగులకే చెల్లింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే.. మున్ముందు గోగులతో సంగీత దర్శకులు మరిన్ని పాటలు పాడించేలా ఉన్నారు.