మంచుకొండల్లో ప్రియాంక గాలి

Priyanka Gandhi ఎట్టకేలకు స్కోర్ ఓపెన్ చేశారు. Himachal Pradesh లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మోదీ ప్రభజనంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమనుకున్న తరుణంలోనే పార్టీకి ఆమె అండ దండా అయ్యారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోటీలో చివరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించిందంటే అది ప్రియాంక చలవేనని చెబుతున్నారు. 

హిమాచల్‌లో Priyanka Gandhi అంతా తానై ప్రచారం చేశారు. పది బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనంలో కలిసిపోతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. హిమాచల్ ప్రజల సహేతుకమైన డిమాండ్ల పై స్పందించారు. యాపిల్ ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర లభించక నానా తంటాలు పడుతుంటే.. వారికి సాయం చేస్తామన్నారు.

యాపిల్‌కు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. దాదాపు అరవై నియోజకవర్గాల్లో యాపిల్ ఉత్పత్తిదారుల ప్రభావం ఉండగా.. చాలా చోట్ల వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారు. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాల కల్పనకు ఏర్పాటు చేస్తామన్నారు .

రాష్ట్రంలోని ప్రతీ మహిళకు 1500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. దానితో మహిళల ఓట్లు పార్టీ ఖాతాలోకి వచ్చేశాయి. ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన అంశాలే.. 

నిజానికి Priyanka Gandhi ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. అక్కడ మోదీ, యోగీ ప్రభంజనంలో పార్టీని పైకి తీసుకురాలేకపోయారు. Himachal Pradesh పరిస్థితులు మాత్రం కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. ప్రియాంక హామీలను జనం విశ్వసించారు. ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులంతా ఇదీ ప్రియాంక విజయమని చెబుతున్నారు. ఇంతకాలానికి ప్రియాంక ఖాతాలో ఒక విజయం నమోదైంది. ఇకపై రాజకీయాల్లో ఆమె దూకుడుగా ఉంటారనుకోవాలి, 

హిమాచల్ విజయం ఆధారంగా ప్రియాంక బృందం వచ్చే ఏడాది ఎన్నికలు జరగే రాష్ట్రాల్లో వ్యూహాలు రచిస్తుంది. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకతో పాటు ఉత్తరాదిన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలున్నాయి. వాటితో పాటు ఐదు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

కొన్ని రాష్ట్రాలను మాత్రం ప్రియాంక ఎంపిక చేసుకుని ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే మాత్రం ప్రియాంకకు తిరుగుండదు. రాహుల్ గాంధీ వల్ల పార్టీకి ప్రయోజనం కలగడం లేదని చెబుతున్న నేపథ్యంలో ప్రియాంక స్వయంగా బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి…