ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. తమకు తోచిన విధంగా ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కానీ, అదేంటో ఏపీలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ వెన్నులో వణుకు పుడుతున్నట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయన పర్యటనలు ఎక్కడ ఉన్నా.. వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
ఇటీవల కాలంలో చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి, నినాదాలతో ప్రజా కార్యక్రమా లు చేపట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ప్రచారం చేస్తున్నారు. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇదే వైసీపీకి కంటగింపుగా మారింది. తమకు ఎక్కడ గండికొడతారో.. అని భయపడుతున్నారో.. లేక, తాము ఓడిపోవడం ఖాయమని అనుకుంటున్నారో తెలియదుకానీ, అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
ఉమ్మడి కృష్ణాలోని నందిగామలో చంద్రబాబు పర్యటించినప్పుడు.. రాళ్లు రువ్వారు. నరసరావు పేటలో నిర్వహించిన సభలోనూ గలాభా సృష్టించారు. అయితే, ఎటొచ్చీ.. కర్నూలులో మాత్రం వైసీపీ నాయకులు మౌనంగా ఉన్నారు. దీంతో ఆ రెండు చోట్ల చంద్రబాబు సభలకు జనాలు రాలేదన్న ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినా.. కర్నూలులో మాత్రం జనాల తాకిడిని చూసి.. వైసీపీ నేతలు నివ్వెర పోయారు. ఇక, అప్పటి నుంచి చంద్రబాబు పర్యటనలకు మళ్లీ అడ్డంకులు సృష్టిస్తున్నారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన చేపట్టారు. అయితే.. ఈ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో వైసీపీ నాయకులపైకి వెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు.. కుమ్ములాటలు జరిగాయి. అయితే, ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. చంద్రబాబు పర్యటన అంటే వైసీపీ వెన్నులో వణుకు వస్తోందా? అనే చర్చ చేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates