కేసీఆర్ సార్ పెళ్లికెళ్లి ప‌ద‌విని గిఫ్ట్ ఇచ్చారు!

ఎవ‌రైనా పెళ్లికి వెళ్లినా..పేరంటానికి వెళ్లినా.. ఆతిథ్య ఇచ్చిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వ‌డం స‌హ‌జ‌మే అయి తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి పెద్ద‌ది క‌దా! ఆయ‌నది ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేంత మ‌న‌సు కాదు. ఇస్తే గి స్తే.. పెద్ద గిఫ్టే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే, ఇన్నాళ్ల‌లో లేంది.. ఆయ‌న ఏం చేశారంటే ఒక పెళ్లికి వెళ్లి ఏకంగా చైర్మ‌న్ ప‌ద‌విని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. దీంతో ఈ ఘ‌ట‌న ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగిందంటే.. ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లా మాజీ మేయర్, టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఇంకేముంది.. కేసీఆర్ స‌ర్‌ను పిలుస్తాం స‌రే.. వ‌స్తారా? రారా? అనే బెంగ పెట్టుకున్న‌వారికి.. ఆయ‌నే సాక్షాత్తూ వ‌స్తే.. ఇక తిరుగు ఏముంటుంది? ఒకింత ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఆశ్చ‌ర్యం నుంచి తేరుకునేలోగానే సీఎం కేసీఆర్ నవ దంపతులను ఆశీర్వదించారు.

అయితే.. ఇదంతా జ‌రుగుతున్న క్ర‌మంలోనే టింగ్ టింగ్ మంటూ.. మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ ఫోన్ మోగింది. ఏంటా అని చూసుకుంటే..ఒక మెసేజ్ వ‌చ్చింది. అది.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి వ‌చ్చిన మెసేజ్. సారాంశం ఏంటంటే..మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్ ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించ‌డ‌మే. ఈ మేరకు విడుద‌లైన‌ ఉత్తర్వుల తాలూకు స‌మాచార‌మే ఆయ‌న ఫోన్‌కు చేరింది.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మేయ‌ర్ బంధువులు, మిత్రులు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.. ఇక అప్ప‌టికే సీఎం కేసీఆర్ త‌న బిడ్డ పెళ్లికి రావ‌డంతో ఆశ్చ‌ర్యంలో ఉన్న సింగ్‌.. ఇక, త‌న‌కు ప‌దవిని గిఫ్ట్‌గా ఇవ్వ‌డంతో మ‌రింత సంతోష ప‌డిపోయారు. ఇక‌, సీఎం కేసీఆర్ ఈ వివాహాన్ని ముగించుకుని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు సేదతీరి.. టీ తాగి బిస్కెట్లు తిని.. వెళ్లిపోయారు.